కౌంటింగ్ ఏజెంట్ల నేర చరిత్ర తనిఖీ పేరుతో టీడీపీ కూటమి నేతల్ని ఇబ్బంది పెట్టాలని జగన్ సర్కార్ చూస్తోందని తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు నక్కా ఆనంద్‌బాబు, పర్చూరి అశోక్‌బాబు, ఏఎస్ రామకృష్ణ తదితరులు మంగళవారం అమరావతి సచివాలయంలో అదనపు సీఈవోను కలిశారు. ‘కౌంటింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియకు సంబంధించి కొందరు రిటర్నింగ్ అధికారులు ఇస్తున్న సర్క్యులర్లు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఐదేళ్లుగా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టిన జగన్ సర్కార్... నేరచరిత్ర తనిఖీ పేరుతో ఇప్పుడు కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చునే టీడీపీ కూటమి నేతల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. కౌంటింగ్ ఏజెంట్ల జాబితా ముందుగా రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తే... వారి నేర చరిత్రను పరిశీలిస్తామని రాజానగరం ఆర్వో సర్క్యులర్ జారీ చేశారు. గతంలో పోలింగ్ ఏజెంట్ల విషయంలోనూ ఇలాగే కొందరు ఆర్వోలు నిబంధనను పెట్టారు. ఈ విషయాన్ని సీఈవో దృష్టికి తీసుకెళ్లగా, ఈసీ మార్గదర్శకాల్లో అలాంటిదేమీ లేదని సర్క్యులర్ జారీ చేశారు. పోలింగ్ రోజు ఉదయం జాబితా ఇచ్చినా సరిపోతుందని సీఈవో స్పష్టం చేశారు. అయినా కొందరు ఆర్వోలు కౌంటింగ్ ఏజెంట్లను ఇబ్బంది పెడుతున్నారు. ఈసీ మార్గదర్శకాల్లో ఎక్కడా లేని ఈ అంశం కౌంటింగ్ ఏజెంట్ల నియామకం లోనూ ఉత్పన్నం కాదని సీఈవో తెలిపారు’ అని టీడీపీ నేతలు రాష్ట్ర అదనపు సీఈవో దృష్టికి తీసుకెళ్లారు.