పోలింగ్ రోజు, ఆ తర్వాత హింసతో అట్టుడికిన అనంత, పల్నాడు జిల్లాల్లో సిట్ బృందాల దర్యాప్తు కొనసాగుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి సిట్ బృందం మరోసారి వచ్చింది. సిట్ సభ్యులు శ్రీనివాసులు, భూషణం, శ్రీనివాస్... తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దాడులకు సంబంధించిన వీడియోలు, రికార్డులను పరిశీలించారు. అల్లర్లకు ప్రధాన కారణంగా గుర్తించిన రాళ్లదాడిని ఎందుకు నియంత్రించలేకపోయారని స్థానిక పోలీసులను సిట్ ప్రశ్నించినట్లు తెలిసింది. గొడవలు జరిగే ప్రమాదం ఉందని ఎస్‌బీ అధికారులు ముందే గుర్తించి సమాచారం ఇచ్చారా? లేదా? సమాచారం ఇచ్చినా స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా? అనే కోణాల్లో సిట్ దర్యాప్తు చేస్తోందని సమాచారం. తాడిపత్రి గొడవల నేపథ్యంలో ఇప్పటికే ఎస్పీ అమిత్ బర్దార్, డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణ సస్పెండ్ అయ్యారు. సిట్ దర్యాప్తు తరువాత తమ పరిస్థితి ఏమిటోనని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. కౌంటింగ్ పూర్తయ్యేవరకూ సిట్ బృందం తాడిపత్రిలోనే తిష్ఠ వేస్తుందని ప్రచారం సాగుతోంది. దీంతో స్థానిక పోలీసులకు కంటిమీద కునుకు కరువైంది. కాగా, పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై జిల్లాలో సిట్ విచారణ కొనసాగుతోంది. మంగళవారం నరసరావుపేట రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో సిట్ అధికారి సౌమ్యలత కేసులకు సంబంధించి పలువురిని ప్రశ్నించినట్టు తెలిసింది. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పా టు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. మాచర్ల ఘటనలకు సంబంధించి సుమారు 30మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్టు పోలీసులు తెలిపారు. నరసరావుపేట, పమిడిపాడు ఘటనలకు సంబంధించి 11మందిని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేత లాం కోటేశ్వరరావు, బీజేపీ నాయకుడు రామకృష్ణతోపాటు 11మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది. వీరందరినీ కోర్టులో హాజరు పరచనున్నట్టు పోలీసులు తెలిపారు.