నైరుతి బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో బుధవారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత అది ఈశాన్యంగా పయనించి ఈనెల 24వ తేదీకల్లా వాయుగుండంగా బలపడి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుందని, ఆ తర్వాత మరింత బలపడి ఈశాన్యంగా పయనిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. ఈశాన్యంగా పయనించే క్రమంలో తుఫాన్‌గా మారి ఈ నెల 25వ తేదీ రాత్రి ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని కొందరు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. అయితే, తుఫాన్‌గా మారి ఉత్తర ఒడిశా తీరం దిశగా పయనిస్తుందని మరో నిపుణుడు తెలిపారు. ఆ ప్రభావంతో ఈనెల 24వ తేదీ నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో వర్షాలు పెరుగుతాయన్నారు. 23వ తేదీ నుంచి మధ్య బంగాళాఖాతం పరిసరాలు అల్లకల్లోలంగా మారుతున్నందున మత్స్యకారులు అటు వైపు వెళ్లరాదని హెచ్చరించారు. ఇప్పటికే దక్షిణ అండమాన్ పరిసరాలను తాకిన నైరుతి రుతుపవనాలు తుఫాన్ ప్రభావంతో అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమరిన్ ప్రాంతంలో మరిన్ని భాగాలకు విస్తరించనున్నాయి. నెలాఖరు నాటికి రుతుపవనాలు కేరళ లోకి ప్రవేశించేలా తుఫాన్ దోహదం చేస్తుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. నెలాఖరులోగా కేరళకు ఆనుకుని ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో ఈనెల 30వ తేదీ నాటికే కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని వెల్లడించారు.