ఓట్ల లెక్కింపు రోజున రాష్ట్రంలో భారీగా అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరస్పరం దాడులకు దిగే అవకాశం ఉందంటూ నిఘా విభాగం వరుస హెచ్చరికలతో చర్యలకు సిద్ధమయ్యారు. ఈ నెల 13న పోలింగ్ రోజు, ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో ముమ్మర గాలింపు చర్యలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగాలు పల్నాడు, రాయలసీమ జిల్లాల పోలీసు అధికారులను అప్రమత్తం చేశాయి. పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లను అడ్డుకోలేకపోవడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ఎస్పీల నుంచి ఎస్‌ఐల దాకా అధికారులపై ఈసీ చర్యలతో ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు. కౌంటింగ్ రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలకు అవకాశం ఇవ్వకుండా పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లాల్లో ఎక్కడికక్కడ కార్డెన్ సెర్చ్ (తనిఖీలు) చేపట్టి గట్టి చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశించారు. ఈ ఆదేశాలతో ఎస్పీలు... జిల్లాల్లో బృందాలను ఏర్పాటుచేశారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసేవరకూ ఎలాంటి సెలవుల్లేవంటూ సిబ్బందితో పోలీసు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. పోల్ డే హింస జరిగిన ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించి... ప్రతి ఇల్లూ, ప్రతి మలుపులోనూ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఎటువంటి మారణాయుధాలు ఉన్నా స్వచ్ఛందంగా ఇవ్వాలని, తాము గుర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ ఇళ్ల వద్దకెళ్లి అడుగుతున్నారు. కౌంటింగ్ హిస్టరీ షీట్స్ ఉన్న ప్రతి ఒక్కరినీ అదుపులోకి తీసుకుని బైండోవర్ చేస్తున్నారు. సంఘ విద్రోహశక్తుల కదలికలపై నిఘాపెట్టి ఏ మాత్రం అనుమానం వచ్చినా అరెస్టు చేస్తున్నారు. వారిని దూరంగా ఉండే పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. పోలింగ్ రోజు హింసకు పాల్పడిన వేలాది మందిని వెతికేందుకు పదుల సంఖ్యలో పోలీసు బృందాలు తిరుగుతున్నాయి. రాష్ట్రం దాటి వెళ్లినవారిని సైతం రప్పించి మరీ అదుపులోకి తీసుకొంటున్నారు.