బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో ఐదుగురిని పోలీసులు నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. అయితే రేవ్ పార్టీ లో కీలక సూత్రధారి విజయవాడ వాసి లంకపల్లి వాసుగా పోలీసులు గుర్తించారు. వన్ టౌన్ కొత్తపేటలోని ఆంజనేయవాగుకు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. విజయవాడలోనూ అతిపెద్ద బుకీల నెట్వర్క్ను వాసు విస్తరించాడు. పైకి మాత్రం వ్యాపారం, ఫార్మా రంగాల పేర్లను ఉపయోగించుకుంటున్నాడని, డీజీపీ కార్యాలయంలో కొంత మంది అధికారుల పేర్లను వాసు ఉపయోగించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్లతో పాటు డ్రగ్స్ వ్యవహారంలోనూ వాసు కీలక సూత్రధారి. విజయవాడలోని గాంధీనగర్లో తన స్నేహితుడితో కలిసి రూ.6 కోట్లతో ఒక స్థలం కొనుగోలు చేశాడు. బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లలో ఏపీ పోలీసుల నంబర్లు ఉండటంతో లోతుగా విచారణ జరుపుతున్నారు. వాసు దందాలకు కొంతమంది పోలీసులు అండగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విచారణ కొనసాగుతోంది.