ఈవీఎం ధ్వంసంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దంటూ హై కోర్టు ఇచ్చిన తీర్పు ఆశ్చర్యానికి గురి చేసిందని మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇలాంటి తీర్పు వచ్చి ఉండదని.. ఉన్నత న్యాయస్థానాలు ఈ తీర్పుపై పునరాలోచించాలని కోరారు. పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని అప్పుడే ప్రజాస్వామ్యం ఉందనే నమ్మకం ఏర్పడుతుందని, న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసుల సహకారంతోనే పిన్నెల్లి తప్పించుకున్నారని, పిన్నెల్లిని అరెస్ట్ చెయ్యకుండా 3 రోజుల పాటు పోలీసులు కాలక్షేపం చెయ్యడంతో న్యాయస్థానంలో పిన్నెల్లికీ ఊరట లభించిందని బాబు రాజేంద్రప్రసాద్ అన్నారు.