వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నుంచి పారిపోవడానికి పోలీసులే సహకరించారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. గురువారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖే్‌షకుమార్ మీనాను కలిసి పలు అంశాలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. ‘13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్రమంగా పోలింగ్ బూత్‌లోకి చొరబడి ఈవీఎం పగలగొడితే పీవో ఎందుకు ఫిర్యాదు చేయలేదు? గుర్తు తెలియని వ్యక్తి ఈవీఎం ధ్వంసం చేశారని వీఆర్‌వో చేత ఫిర్యాదు చేయించడం ఏంటీ? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? వెబ్ కాస్టింగ్ పెట్టామన్నారు. ఏం చేశారు? ఎమ్మెల్యే ఈవీఎం పగలగొట్టి బయటకి వెళ్తుంటే బూతు వద్ద బందోబస్తులో ఉన్న కానిస్టేబుళ్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదు? ఈ పరిస్థితి చూస్తుంటే ఓట్ల లెక్కింపు సజావుగా జరుగుతుందన్న నమ్మకంలేదు. పిన్నెల్లి మాచర్ల నుంచి పారిపోవడానికి కారణం పోలీసులే. దీనికి ఎవరు సహకరించారు? ఎస్పీనా, డీఐజీనా? ఇదంతా ఈసీకి తెలియకుండా జరిగిందా?’ అని వర్ల ప్రశ్నించారు. దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ...మాచర్లలో పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అవ్వడం వల్లే టీడీపీ పోలింగ్ ఏజెంట్ శేషగిరిపై దాడి జరిగిందన్నారు. అన్నింటికీ కారణం సీఎస్ జవహర్‌రెడ్డేనని మండిపడ్డారు. కాగా, పల్నాడులో పోలింగ్ రోజు, ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలు, ఓటర్లపై దాడులకు పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ దేవినేని ఉమా డీజీపీకి లేఖ రాశారు.