రోజురోజుకూ పెరుగుతున్న సాంకేతికత మనిషి జీవితాన్ని మరింత సులభతరం చేస్తోంది. ఇదే సమయంలో కత్తికి రెండువైపులా పదును ఉన్నట్లు టెక్నాలజీ విషయంలోనూ ఇదే సామెత వర్తిస్తుంది. అయితే టెక్నాలజీ పెరిగిపోయి ఇప్పుడు ఫేస్‌బుక్, ఎక్స్, వాట్సప్ అంటూ అనేక సోషల్ మీడియా మాధ్యమాలు అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో సెల్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. సర్వం చేతిలో ఉందనే పరిస్థితి. అందుకే మనుషుల మధ్యన మాటలు తగ్గిపోయి.. వాట్సాప్‍లలో షేరింగులు పెరిగిపోయాయి. అయితే సోషల్ మీడియా గురించి ఇప్పుడింత ఉపోద్ఘాతం ఎందుకంటే.. వాట్సాప్ గ్రూప్ చూడలేదనే కారణంతో ఓ టీచర్ సస్పెండ్ అయ్యారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని మొగల్రాజపురంలో జరిగింది.
మొగల్రాజపురంలోని బీఎస్ఆర్‌కే ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సమాచారాన్ని అందరికీ ఈజీగా చేరవేసేందుకు ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. పై స్థాయి అధికారులు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఇక స్కూలుకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే అందులో షేర్ చేస్తూ వచ్చేవారు. అయితే రమేష్ అనే టీచర్ గత కొంతకాలంగా ఈ వాట్సాప్ గ్రూపులో వచ్చే మెసేజ్‌లను పట్టించుకోలేదు. ఇదే క్రమంలో అర్ధాంతరంగా గ్రూపులో నుంచి ఎగ్జిట్ అయ్యాడు. దీని గురించి పై అధికారులు వివరణ కోరినప్పటికీ.. రమేష్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిసింది. దీంతో డీఈవో రమేష్‌ను సస్పెండ్ చేశారు.
అయితే ఈ వ్యవహారంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. రమేష్‌కు కంటి సమస్య ఉందని.. డాక్టర్లు చెబితే ఫోన్ వాడట్లేదని చెప్తున్నాయి. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పినా వారు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఉపాధ్యాయ సంఘాలు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వినతిపత్రం కూడా సమర్పించాయి. అయితే జిల్లా విద్యాశాఖ అధికారి మాత్రం విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకే రమేష్‌ను సస్పెండ్ చేసినట్లు చెప్తున్నారు. వాట్సప్ గ్రూప్ నుంచి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎగ్జిట్ అవ్వడమే కాకుండా.. కంటి సమస్య గురించి పత్రాలు అడిగినా ఇవ్వలేదని డీఈవో సుబ్బారావు చెప్తున్నారు. కంటి సమస్యపై వైద్యుల నుంచి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవటంతో పాటుగా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకే సస్పెండ్ చేసినట్లు తెలిపారు.