కర్నూలు జిల్లా, వెలుగోడు పట్టణంలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆదివారం తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కటుంబ సభ్యుల వివరాల మేరకు.. వెలుగోడు పట్టణంలోని సీపీ నగర్‌కు చెందిన షేక్ ఖాసిం(46) సుమారు ఆరు నెలల నుంచి భార్యా పిల్లలతో కలిసి భార్య పుట్టినిల్లయిన పులిమద్దిలో నివాసం ఉంటున్నాడు. అయితే ఖాసిం మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు మందలించినా వినకపోగా ఆత్మహత్య చేసుకుంటానని భయపెట్టేవాడు. ఈ క్రమంలో వెలుగోడులో జరుగుతున్న రోఖయాబి దర్గా ఉరుసుకు భార్యా పిల్లలతో కలిసి వెళ్లాలనుకున్నాడు. అయితే వారు నిరాకరించడంతో ఖాసీం ఒక్కడే వెలుగోడుకు చేరుకున్నాడు. ఆ తరువాత తన తల్లి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య రమిజాబి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరుకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
![]() |
![]() |