నాలుగు సార్లు ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ప్రాణాలకు రక్షణ కరువైంది. ఒక కేసు నుంచి ఊరట దొరికిందని అనుకునేలోపు.. మూడు తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేసే యత్నాలు చేస్తున్నారు. అంతేకాదు సదరు ఎమ్మెల్యేను హతమార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది వైయస్ఆర్‌సీపీ. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఒకదాని వెంట ఒకటి వరుస కేసులు పెడుతున్నారు పోలీసులు. ఇప్పటికే ఈవీఎం ఘటన కేసులో హైకోర్టు ఆయనకు ఊరట లభించగా.. ఆయన్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలని కంకణం కట్టుకున్న పోలీసులు మరో మూడు హత్యాయత్నం కేసులు పెట్టారు. అయితే ఈ పరిణామాలపై వైయస్ఆర్‌సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏదో ఒకలా ఆయన్ని హతమార్చేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే ఇదంతా అని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసాత్మ ఘటనలను.. తదనంతర పరిణామాలను చూసిన ఎవరికైనా కొన్ని అనుమానాలు రావడం సహజం. అటు ఎన్నికల సంఘం, ఇటు పోలీస్ శాఖ ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి అనుబంధ సంఘాలుగా మారాయి ఏమో అనిపించకమానదు. దీనికి తోడు పిన్నెల్లిని లక్ష్యంగా చేసుకుని పచ్చ బ్యాచ్ పన్నుతున్న కుట్రలు చూస్తున్నదే. అయితే దీని వెనుక కుట్ర జరుగుతోందని వైయస్ఆర్‌సీపీ అనుమానిస్తోంది. సీఐ నారాయణస్వామిచౌదరి ఆధ్వర్యంలోనే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపిస్తోంది.
![]() |
![]() |