జూన్4వ తేదీ ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. గ్రామాలవారీ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నియోజకవర్గంలోని వరుస క్రమంలో బూత్‌లవారీ ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌ల సంఖ్యను ఆధారంగా ఓట్ల లెక్కింపు కోసం నిర్ది్ష్ట సంఖ్యలో టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఎక్కువ టేబుల్స్ ఏర్పాటుచేసిన చోట ఫలితం త్వరగా వెల్లడవుతుంది. తక్కువ టేబుళ్లు ఏర్పాటుచేస్తే ఫలితం రావడం ఆలస్యం అవుతుంది. ఒక్కో నియోజకవర్గానికి 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. ఎక్కడైనా కౌంటింగ్ హాల్ చిన్నదిగా ఉంటే అక్కడ 10 టేబుళ్ల వరకు ఏర్పాటు చేస్తారు. ఇలాంటి చోట ఫలితం రావడానికి సాయంత్రం అవుతుంది. ఒక్కో రౌండ్‌లో 14 ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఇలా నియోజకవర్గంలోని బూత్‌ల సంఖ్య ఆధారంగా రౌండ్లవారీ కౌంటింగ్ జరుగుతుంది. ఏదైనా నియోజకవర్గంలో 140 బూత్‌లు ఉంటే ఒక్కో రౌండ్‌లో 14 ఈవీఎంలను లెక్కిస్తే 10 రౌండ్లు కౌటింగ్ జరుగుతుంది. ఎన్ని రౌండ్లు అనేవి నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.