ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఇక చివరి విడత ఎన్నికలు జూన్ 1 వ తేదీన జరగనున్నాయి. అయితే చివరి విడత ఎన్నికల ప్రచారం మే 30 వ తేదీతో తెరపడనుంది. ఈ క్రమంలోనే మొత్తం 7 దశల్లో జరగనున్న ఎన్నికల ప్రచారంలో గత కొన్ని నెలలుగా దేశం మొత్తం పలుమార్లు చుట్టివచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఎన్నికల ప్రచారం ముగియగానే కాస్త విరామం తీసుకోనున్నారు. ఎప్పుడూ పరిపాలన, ఎన్నికలు, రాష్ట్రాల పర్యటనలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో షెడ్యూల్ ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే.. మోదీ.. రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు.
ఏడో విడత ఎన్నికల ప్రచారం ముగిసే మే 30 వ తేదీ తర్వాత రెండు రోజుల పాటు ప్రధాని మోదీ.. తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లనున్నారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ వద్ద నరేంద్ర మోదీ ధ్యానం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు అక్కడే ఉండి మే 30, 31 వ తేదీల్లో వివేకానంద రాక్ మెమోరియల్ హాల్‌లో ధ్యానం చేయనున్నారు. ఆ తర్వాత జూన్ 1 వ తేదీన కన్యాకుమారి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అయితే గతంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ.. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియగానే ఇలా విశ్రాంతి తీసుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ముందు ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ క్షేత్రానికి వెళ్లిన ప్రధాని మోదీ.. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత హిమాలయాల్లో 11700 అడుగుల ఎత్తులో ఉన్న గుహలో నరేంద్ర మోదీ ధ్యానం చేశారు. కేదార్‌నాథ్ నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న రుద్ర ధ్యాన గుహలో ప్రధాని.. ఒక రాత్రి మొత్తం అక్కడే ఉన్నారు.
మొత్తం దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు 6 దశల పోలింగ్ పూర్తయింది. ఇక జూన్ 1 వ తేదీన చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇక జూన్ 4 వ తేదీన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఏడో విడత ఎన్నికల ప్రచారం ఈ నెల 30 వ తేదీన ముగియనుంది.