షుగర్ వ్యాధితో బాధపడేవారు చాలా మంది ఉంటారు. అయితే ఈ మధుమేహ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే చాలు.. నయం కావడం దాదాపు అసాధ్యం. ఇక ఈ డయాబెటిస్ సోకిన వారికి.. అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక శరీరంలోని పలు అవయవాలపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. చివరికి గుండె, కిడ్నీతోపాటు కంటి సమస్యలు ఏర్పడుతాయి. ఇక శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకునేందుకు బాధితులు నిత్యం ట్యాబ్లె్ట్లు వేసుకుంటూ ఉంటారు. ఇక షుగర్ లెవల్స్ బాగా పెరిగిపోయిన వారు ఏకంగా ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉంటారు. అయితే శాస్త్రవేత్తలు ప్రస్తుతం షుగర్ వ్యాధికి కొత్త చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చారు.
చైనా శాస్త్రవేత్తలు.. డయాబెటిస్‌ను పూర్తిగా తగ్గించేందుకు అనేక పరిశోధనలు నిర్వహించి సెల్ థెరపీని తీసుకువచ్చారు. ఇది టాబ్లెట్లు, ఇన్సులిన్ ఇంజెక్షన్ల బాధను షుగర్ పేషంట్లకు తగ్గించనుంది. అంతేకాకుండా ఈ సెల్ థెరపీతో మధుమేహాన్ని పూర్తిగా నయం చేస్తున్నారు. ఈ సెల్ థెరపీ ఉపయోగించి షుగర్ రోగులలోని పెరిపెరల్ బ్లడ్ మోనో న్యూక్లియర్ సెల్స్‌ను సీడ్ సెల్స్‌గా మారుస్తారు. అంతేకాకుండా ప్యాంక్రియాట్ ఐలెట్ సెల్స్‌ను రీ క్రియేట్ చేశారు. ఈ ప్రక్రియ ద్వారా వారి శరీరంలో ఉండే షుగర్ వ్యాధిని పూర్తిగా కంట్రోల్ చేశారు.
చైనాలోని షాంఘై చాంగ్‌జెంగ్ హాస్పిటల్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మాలిక్యులార్ సెల్ సైన్సెస్, రెంజి హాస్పిటల్‌కు సంబంధించిన శాస్త్రవేత్తలు, డాక్టర్ల బృందం ఈ సెల్ థెరపీని అభివృద్ధి చేసింది. ఏప్రిల్ 30 వ తేదీన ది జర్నల్ సెల్ డిస్కవరీ అనే జర్నల్‌లో ఈ ప్రయోగ ఫలితాలను ప్రచురించారు.
ఈ సెల్ థెరపీ విధానం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ సెల్ థెరపీ విధానానికి సంబంధించి తొలి దశ ప్రయోగం సక్సెస్ అయిందని సంబంధిత శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనిపై మరిన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయని వివరించారు. అవి కూడా విజయవంతం అయితే.. అందరు షుగర్ పేషంట్లకు ఈ సెల్ థెరపీ విధానం అమల్లోకి రానుంది. అయితే చైనా శాస్త్రవేత్తలు గత 25 ఏళ్లుగా ఈ సెల్ థెరపీపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు.
డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్న ఓ 59 ఏళ్ల వ్యక్తిపై ఈ సెల్ థెరపీ విధానాన్ని అమలు చేశాయి.. అయితే ఆ వ్యక్తికి షుగర్ వ్యాధి కారణంగా 2017 లో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ కూడా జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల నుంచి ఈ పరిశోధన చేశారు. సెల్ థెరపీ ద్వారా అతడికి కొన్నేళ్లుగా చికిత్స కొనసాగించారు. అయితే ఈ సెల్ థెరపీ ప్రారంభించిన తర్వాత సుమారు 10 నుంచి 11 వారాల తర్వాత.. ఆ రోగికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం కనిపించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. షుగర్ కంట్రోల్ కోసం టాబ్లెట్లు కూడా వేసుకోలేదని స్పష్టం చేశారు.
సెల్ థెరపీ మొదలు పెట్టిన తర్వాత డయాబెటిక్ రోగిలో ప్యాంక్రియాటిక్ ఐలెట్ పని తీరు మెరుగుపడినట్లు పరిశోధకులు గుర్తించారు. తర్వాత పూర్తిగా అతను మధుమేహాం నుంచి కోలుకున్నాడని తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తి 33 నెలలుగా ఆ వ్యక్తికి ఎలాంటి ఇన్సులిన్ లేకుండానే షుగర్ కంట్రోల్‌లో ఉందని పేర్కొన్నారు. ఆ వ్యక్తికి 2021 జూలైలో సెల్ ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది.