ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్, కేజ్రీవాల్‌కు పాక్ నేతల మద్దతుపై విచారణ.. మోదీ

national |  Suryaa Desk  | Published : Tue, May 28, 2024, 10:32 PM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు పాకిస్థాన్ నేతలు మద్దతుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, దీనిపై విచారణ జరిపించాల్సిందేనని మోదీ పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘నేను ఉన్న స్థానాన్ని బట్టి అటువంటి విషయాలపై వ్యాఖ్యానించాలని నేను అనుకోను.. కానీ మీ ఆందోళనను నేను అర్థం చేసుకోగలను’’ అని మోదీ అన్నారు. పాకిస్థాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ చౌధరి ఇటీవల రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశంసలు కురిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.


ఇదే అంశంపై ఇంటర్వ్యూలో మోదీ స్పందిస్తూ.. ‘‘మమ్మల్ని ద్వేషించవాళ్లు కొంతమందిని ఎందుకు ఇష్టపడతారో తెలియదు.. కొంతమందికి మద్దతుగా అక్కడి నుంచి ఎందుకు గొంతులు వినిపిస్తున్నాయి’’ అని ప్రశ్నించారు. ఇది చాలా ఆందోళనకర విషయమే అని అన్నారు. అయితే, భారతీయ ఓటర్లు పరిణితి చెందినవారని, అలాంటి ప్రకటనలు సరిహద్దు ప్రాంతాల్లో ఎన్నికలను ప్రభావితం చేయలేవని తెలిపారు.


‘‘ఇవి భారత్‌లో ఎన్నికలు.. భారతదేశ ప్రజాస్వామ్యం చాలా పరిణతి చెందింది.. ఆరోగ్యకరమైన సంప్రదాయాలు మన సొంతం.. దేశంలోని ఓటర్లు కూడా బయటి కార్యకలాపాల వల్ల ప్రభావితమయ్యేవారు కాదు’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఇక, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్యాబినెట్‌లోని మంత్రిగా పనిచేసిన ఫవాద్ హుస్సేన్ ఛౌదరి.. ఇటీవల అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడు ట్విట్టర్‌లో స్పందించారు. ‘కేజ్రీవాల్ విడుదలతో మరో యుద్ధంలో మోదీ జీ ఓడిపోయారని.. ఇది ఆధునిక భారతానికి శుభవార్త’ అని ట్వీట్ చేశారు. అంతేకాదు, ఢిల్లీలో పోలింగ్ సందర్భంగా కేజ్రీవాల్, ఆయన కుటుంబం ఓటేయడానికి వెళ్లిన ఫోటో‌పై కూడా స్పందించారు. ‘భారత్ ఎన్నికల్లో శాంతి, సామరస్యం.. బలవంతుల విద్వేషం, తీవ్రవాద శక్తులను ఓడించాలి’ అని కామెంట్ చేశారు.


అయితే, ఈ కామెంట్‌కు కేజ్రీవాల్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. ‘చౌదరి సాహిబ్.. మాదేశంలో సమస్యలను పరిష్కరించుకునే సామర్ధ్యం నాకు, మాకు దేశ ప్రజలకు ఉంది.. మాకు మీ సలహాలు అవసరం లేదు... అసలే మీ దేశం పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ముందు ఆ పని చూడండి. భారత్‌లో ఎన్నికలు పూర్తిగా మా అంతర్గత వ్యవహారం. మీ జోక్యాన్ని ఏమాత్రం సహించం’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీకి మద్దతుగా పాక్ మాజీ మంత్రి చేసిన ట్వీట్‌పై కూడా తీవ్ర దుమారం రేగింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా బీజేపీ నేతలు దీనిపై విరుచుకుపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com