యూట్యూబ్‌లో యాడ్స్ (ప్రకటనలు) లేకుండా వీడియోలు చూసేందుకు చాలా మంది యాడ్ బ్లాకర్స్ వాడుతుంటారన్న సంగతి తెలిసిందే. వారిని అడ్డుకునేందుకే యూట్యూబ్ సంవత్సర కాలంగా చర్యలు తీసుకుంటోంది. ముందుగా తమ యాడ్ బ్లాకర్స్ నిలిపివేయాలని కోరుతూ సందేశాలు కూడా జారీ చేసిన యూట్యూబ్.. ఆ తర్వాత కూడా వినియోగిస్తే.. 3 వీడియోల తర్వాత వీడియోలు ఇక మీదట ప్లే కాకుండా నిలిపి వేసింది. ఇప్పటికీ ఆ సమస్య అలానే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరో అడుగు ముందుకేసిన యూట్యూబ్ యాజమాన్యం.. ఏకంగా వీడియో ప్లే కాకుండా అడ్డుకుంటోంది. ఇందుకోసం కొత్త ఆంక్షలు తీసుకొచ్చింది.
యాడ్ బ్లాకర్స్ ఉపయోగించే కస్టమర్లకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. యాడ్ బ్లాకర్స్ వాడుతూ యూట్యూబ్ వీడియోలు ప్లే చేస్తే.. అప్పుడు ఆ వీడియోలు ఆటోమేటిక్‌గా స్కిప్ అవుతాయి. అంటే వీడియో మీరు అప్పుడు ప్లే చేస్తే వెంటనే వీడియో ఎండ్ అయినట్లు చూపిస్తుందని చెప్పొచ్చు. దీనితో బ్లాకర్స్‌ను వినియోగించేవారు వీడియో చూసే అవకాశమే ఉండదన్నమాట. ఇప్పటికే ఇలాంటి తరహా అనుభవాల్ని తాము ఎదుర్కొంటున్నామని చాలా మంది యూజర్లు.. రెడ్డిట్ ప్లాట్‌ఫాంలో పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాల్లో కూడా ట్రెండ్ అవుతోంది.
ఆదాయాన్ని పెంచుకునే ప్రణాళికల్లో భాగంగా.. యూట్యూబ్ యాడ్స్ పెంచింది. మొదటగా 30 సెకన్ల స్కిప్పబుల్ బటన్‌తో ప్రకటనల్ని అందించగా.. ఆ తర్వాత స్కిప్ ఆప్షన్ లేకుండానే యాడ్స్ తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే చాలా మంది ఇప్పుడు యాడ్స్‌కు చెక్ పెట్టేందుకు బ్లాకర్స్ వాడుతున్నారు. తమ వేదికపై కంటెంట్ అందించే క్రియేటర్స్‌కు ఆదాయం అందించాలంటే.. యాడ్స్ ముఖ్యమని యూట్యూబ్ చెబుతోంది. ఒకవేళ యాడ్స్‌తో ఇబ్బంది ఎదుర్కొంటుంటే ప్రీమియంకు సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని సూచిస్తోంది.