ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత రిలాక్సింగ్ మోడ్‌లోకి వెళ్లిన పొలిటికల్ లీడర్లు తిరిగి యాక్టివ్ అవుతున్నారు. పోలింగ్ పూర్తైన వెంటనే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యూరోప్ టూర్‌కు వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సైతం విదేశాలకు వెళ్లారు. అయితే విదేశీ పర్యటన పూర్తి చేసుకుని తిరిగొచ్చిన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు యాక్షన్ మోడ్‌లోకి వచ్చారు. జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో.. అమెరికా నుంచి రాగానే టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన నారా చంద్రబాబు నాయుడు.. పలు కీలక అంశాలపై టీడీపీ నేతలకు సూచనలు చేశారు. అలాగే కౌంటింగ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మే 31న పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
మరోవైపు మే 31వ తేదీన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కూడా జరగనుంది. ఇద్దరు నేతలు పోలింగ్ జరిగిన తీరు, ఆ తర్వాత పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం . బీజేపీ నేతలు కూడా అదే రోజు చంద్రబాబును కలవనున్నట్లు సమాచారం. ఇక జూన్ ఒకటో తేదీ జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు తెలుగుదేశం పార్టీ శిక్షణ ఇవ్వనుంది. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌కు సంబంధించి వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. వైసీపీ నేతలు ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారని చంద్రబాబు విమర్శించారు.
మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా జూన్ మూడో తేదీన పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నట్లు తెలిసింది. మే 31వ తేదీన చంద్రబాబుతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్.. పోలింగ్ సరళి మీద, కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చిస్తారు. అనంతరం జూన్ మూడో తేదీన మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారని జనసేన వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అప్రమత్తంగా ఉండాల్సిన తీరుపై పవన్ వివరించే అవకాశం ఉంది.