బాపట్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వాగులో ఈతకు దిగి ఇద్దరు యువకులు చనిపోయారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఆరుగురు యువకులు విహారయాత్ర కోసం బుధవారం ఉదయం సూర్యలంక బీచ్‌కు వచ్చారు. బీచ్‌లో ఎంజాయ్ చేసిన యువకులు.. ఆ తర్వాత హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. అయితే తిరిగి వెళ్తున్న క్రమంలోనే బాపట్ల పట్టణం శివార్లలోనే ఉన్న నల్లమడ వాగులో ఈత కోసం దిగారు. అయితే లోతు ఎక్కువగా ఉండటం.. నీరు వేగంగా ప్రవహిస్తూ ఉండటంతో ఓ యువకుడు వాగులో కొట్టుకుపోయాడు.
అయితే స్నేహితుణ్ని కాపాడే ప్రయత్నంలో.. మిగతా ముగ్గురు గల్లంతైనట్లు తెలిసింది. ఇక సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులు మృతదేహాలు లభ్యమయ్యాయి. సన్నీ, సునీల్ అనే యువకుల మృతదేహాలు లభ్యం కాగా.. గల్లంతైన గిరి, నందు అనే యువకుల కోసం గాలిస్తున్నారు. పడవలో ద్వారా వాగులో గాలిస్తున్నారు. మరోవైపు ఈ విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న యువకుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వాగు లోతు ఎంత ఉందనేది ముందస్తు అంచనా లేకుండా దిగినందువల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. లోతు ఎక్కువగా ఉండటంతో పాటుగా ప్రవాహ ఉధృతికి ఓ యువకుడు కొట్టుకుపోయినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. అతన్ని రక్షించే ప్రయత్నంలో మిగతా ముగ్గురు కూడా వాగులో మునిగిపోయినట్లు చెప్తున్నారు. సరదాగా ఎంజాయ్ చేసేందుకని విహారయాత్రగా వెళ్తే అది విషాదంగా మారిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.