ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్లు తీసుకుంటున్నవారికి ముఖ్యమైన గమనిక. జూన్ నెలకు సంబంధించిన పింఛన్‌కు సంబంధించి స్పష్టత వచ్చింది. జూన్ 1న పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్‌లలోనే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులు, నడవలేనివారు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, వీల్‌ఛైర్‌లోనే ఉండేవారికి మాత్రం ఇంటి దగ్గరే పింఛన్లు పంపిణీ చేయనున్నారు.అయితే గత నెలలో బ్యాంక్ అకౌంట్‌ల విషయంలో చాలామంది లబ్ధిదారులు ఇబ్బందిపడ్డారు.. మరి వారి పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది.
ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకావడంతో ఏప్రిల్ నెల నుంచి వాలంటీర్లను ఎన్నికల సంఘం పక్కన పెట్టింది. వారితో పింఛన్లు పంపిణీ చేయొద్దని ఆదేశించింది.. దీంతో ఏప్రిల్ 1న గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్లను పంపిణీ చేశారు. మే నెలలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బుల్ని జమ చేశారు. ఈ నెల కూడా అదే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం పింఛన్లను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఏపీలో పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం కూడా మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలలో ఆదేశాల ప్రకారం.. గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర పింఛన్లు పంపిణీ చేయాలని సూచించింది. దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడేవారు, నడవలేనివారికి ఇంటి దగ్గరే పంపిణీ చేయాలని తెలిపింది. ఆ నెల గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర పింఛన్లను పంపిణీ చేశారు. మే నెలలో ప్రభుత్వం బ్యాంకు అకౌంట్‌లలో పింఛన్ డబ్బుల్ని జమ చేసింది. దీంతో పింఛన్ లబ్ధిదారులు బ్యాంకులకు క్యూ కట్టడంతో అక్కడ రద్దీ పెరిగింది.. కొందరికి బ్యాంక్ అకౌంట్‌ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. మరి జూన్ నెల పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. జులై నెల నుంచి అధికారం చేపట్టబోయే ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేయనుంది. వైఎస్సార్‌సీపీ తాము అధికారంలోకి రావడం ఖాయమని.. మళ్లీ వాలంటీర్లతో ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయిస్తామని చెబుతోంది. అటు టీడీపీ కూటమి తాము ఇచ్చిన హామీ ప్రకారం.. జులై నెల నుంచి పింఛన్‌ను రూ.3 వేల నుంచి 4వేలకు పెంచి ఇంటింటికి పంపిణీ చేస్తామంటోంది. అదే దివ్యాంగులకు అయితే రూ.6వేలు పింఛన్ ఇస్తామని చెబుతోంది. అంతేకాదు పెంచిన పింఛన్ ఏప్రిల్ నెల నుంచి ఇస్తామని.. జులై నెలకు సంబంధించి రూ.4వేలు.. మూడు నెలలకు సంబంధించి పెంచిన పింఛన్ రూ.వెయ్యి కలిపి రూ.7 వేలు ఇస్తామని చెబుతుంది. జూన్ 4న ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది తేలనుంది.