ఏపీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై అంతటా ఒకటే చర్చ. అధికార, విపక్షాలు ఎన్నికల్లో హోరాహోరీగా సర్వశక్తులు ఒడ్డి పోరాడటంతో.. ఫలితాలపై ముందే ఓ అంచనాకు రాలేని పరిస్థితి. దీనికి తోడు భారీగా నమోదైన పోలింగ్ శాతం కూడా.. ఓ క్లారిటీ ఇవ్వలేకపోతోంది. రాజకీయ విశ్లేషకులు, నిపుణులు కూడా ఈ పార్టీ గెలుస్తుందని ధీమాగా చెప్పలేకపోతున్నారు. ఇదిలా ఉంటే పార్టీల అభిమానులు మాత్రం.. తమ పార్టీనే గెలుస్తుందని ధీమాగా ఉన్నారు. ఈ ధీమాకు తోడు పలు లాజిక్కులు తీస్తూ.. విజయం మీద విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాలపై ఓ ఎక్స్ యూజర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజనం ఇదెక్కడి లాజిక్ రా సామీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
2003 వన్డే ప్రపంచకప్‌లో ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. అలాగే 2004 ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుపై.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. 2023 వన్డే ప్రపంచకప్‌లోనూ ఫైనల్‌లో ఇండియాపై ఆస్ట్రేలియా గెలిచింది. అందుకే 2024లోనూ చంద్రబాబుపై వైఎస్ జగన్ గెలుస్తారంటూ ఓ యూజర్ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్‌ను వైసీపీ శ్రేణులు తెగ షేర్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ ఫైనల్‌కు సంబంధించి కూడా ఇలాంటి లాజిక్ ఒకటి పట్టుకొచ్చారు.
ఈ సారి ఐపీఎల్ కప్పు హైదరాబాద్ గెలుస్తుందంటూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అదే వేణుస్వామి ఏపీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందంటూ జోస్యం చెప్పారు. అయితే ఐపీఎల్ ఫైనల్‌లో హైదరాబాద్ మీద కోల్ కతా విజయం సాధించింది. దీంతో వేణుస్వామి అంచనాలు తప్పని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీపై టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని తెలుగుతమ్ముళ్లు నెట్టింట పోస్టులు కుమ్మేసారు. ఇప్పుడేమో వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు.. వైసీపీ విజయానికి ముడిపెడుతూ ఓ లాజిక్ తీయడం నెట్టింట వైరల్ అవుతోంది.
జూన్ నాలుగో తేదీన ఏపీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్ ముగిసి ఫలితాలు తేలేవరకూ ఇలాంటి లాజిక్కులు, అంచనాలు, పోలికలు తప్పవని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇలా లాజిక్కులు తీసి పార్టీల శ్రేణులు, అభిమానులు అప్పటి వరకూ సంతృప్తిచెందాల్సిందేనంటున్నారు. మరి ఎవరి పోలికలు నిజమవుతాయో.. ఎవరి అంచనాలు కరెక్ట్ అవుతాయో జూన్ నాలుగే తేదీ తేలిపోనుంది.