దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఆఖరి విడత పోలింగ్ జూన్ ఒకటో తేదీన జరగనుండగా.. రేపు (గురువారం) సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. ఇక ఇన్నిరోజులు ఎన్నికల ప్రచారాలు, పర్యటనలతో బిజీబిజీగా గడిపిన నేతలు అందరూ రేపు సాయంత్రం నుంచి రిలాక్స్ అవనున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనేత, హోంమంత్రి అమిత్ షా.. రేపు సాయంత్రం ఏపీకి రానున్నారు. చివరిదశ ఎన్నికల ప్రచారం కోసం వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన అమిత్ షా.. రేపు( మే 30) రాత్రి ఆంధ్రప్రదేశ్ రానున్నారు. మే 30వ తేదీ రాత్రికి అమిత్ షా తిరుమలకు ప్రత్యేక విమానంలో వస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
ఇక గురువారం రాత్రికి తిరుమల చేరుకోనున్న అమిత్ షా.. వకుళామాత గెస్ట్ హౌస్‌లో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు అమిత్ షా శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి తిరిగి రాజ్‌కోట్ బయల్దేరి వెళ్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి.అయితే ఎన్నికల ప్రచారం కోసం అమిత్ షా ఇటీవల ఏపీలో పర్యటించారు. ధర్మవరం సహా పలుచోట్ల ఎన్డీయే కూటమి ఏర్పాటుచేసిన ప్రచారసభల్లో పాల్గొన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత అమిత్ షా.. ఏపీకి రావటం ఇదే తొలిసారి. అది కూడా కౌంటింగ్‌కు ముందు వస్తున్న సమయంలో.. కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆయన్ని కలుస్తారా అనేది ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎన్నికల పోలింగ్ తర్వాత అమిత్ షా తొలిసారిగా ఏపీకి వస్తుండటంతో.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోలింగ్ సరళి మీద ఆయనతో ఏమైనా చర్చిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై ఎన్డీయే కూటమి వైపు నుంచి క్లారిటీ లేదు. అమిత్ షా కేవలం శ్రీవారి దర్శనానికి మాత్రమే వస్తున్నారా.. ఈ పర్యటనలో రాజకీయ నేతలను కలిసి, ఏపీ రాజకీయాలపై చర్చిస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు మే 31వ తేదీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీకానున్నారు. ఈ భేటీలో పోలింగ్ సరళిపైనా, కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా చర్చించనున్నట్లు సమాచారం .