ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం పిఠాపురం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఈ నియోజకర్గం హాట్ టాపిక్ అయ్యింది. ఈ నెల 13న పోలింగ్ ముగియగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈలోపు జనసైనికులు పిఠాపురంలో కొత్త ట్రెండ్‌ను తీసుకొచ్చారు.. పవన్ కళ్యాణ్ గెలుపుపై ధీమాతో ఉన్నారో ఏమో.. అప్పుడే జనసేనానిని ఎమ్మెల్యేను చేసేశారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా.. జనసైనికులు అలాంటి ట్రెండ్‌ను పిఠాపురంలో పరిచయం చేశారు.
జనసైనికులు తమ బైక్‌లు, కార్ల నంబర్ ప్లేట్లపై 'పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా' అంటూ రాయిస్తున్నారు. నంబర్ ప్లేట్లపై జనసేన పార్టీ సింబల్‌తో ఇలా ఫలానావారి తాలూకా అంటూ స్టిక్కర్లు అంటించుకుని తిరుగుతున్నారు. ఈ వాహనాల వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముందు ఒకరిద్దరితో ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పుడు పిఠాపురం మొత్తం నడుస్తోందని చెబుతున్నారు. నంబర్ ప్లేట్‌లకు స్టిక్కరింగ్ చేసే షాపుల్లో సందడి కనిపిస్తోంది.. పిఠాపురంలోని ఓ సెంటర్‌లో.. రెండ్రోజుల్లోనే ఏకంగా 300 బోర్డులు తయారు చేసినట్లు షాపుల యజమానులు చెబుతున్నారు. ఆర్డర్లు కూడా ఎక్కువగా వస్తున్నాయంటున్నారు.
జనసైనికులు సంగతి అలా ఉంటే.. ఇటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కూడా తగ్గేది లేదంటున్నారు. జనసే పార్టీ వాళ్లనే.. తాము కూడా రెడీ అంటూ వాళ్లు కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. జనసేనకు కౌంటర్‌గా అన్నట్లు.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంగా గీతకు డిప్యూటీ సీఎం పదవి హామీ ఇవ్వడంతో.. వీరు ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. డిప్యూటీ సీఎంగారి తాలూకా అంటూ వీళ్లు కూడా బైక్‌లు, కార్లపై రాయిస్తున్నారు. నెంబర్ ప్లేట్లను వంగా గీత పేరుతో నింపేశారు. ఇలా పిఠాపురంలో అటు జనసైనికులు, ఇటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ పిఠాపురం నంబర్ ప్లేట్ల ట్రెండ్ వైరల్ అవుతోంది. అయిలే ఆర్టీఏ నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్లపై ఇలా రాయకూడదు.
పిఠాపురంలో తమ పార్టీ అభ్యర్థిదే విజయం అంటూ అటు జనసేన, ఇటు వైఎస్సార్‌సీపీ కేడర్ ధీమాతో ఉన్నారు. అందుకే పోటాపోటీగా వాహణాల నంబర్ ప్లేట్లపై ఫలానావారి తాలూకా అంటూ కొత్త ట్రెండ్‌ను తీసుకొచ్చారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించిన రోజు నుంచి అక్కడ రాజకీయాలు వేడెక్కాయి.. జనసేన పార్టీ తరఫున పలువురు టాలీవుడ్ ప్రముఖులు ప్రచారం చేశారు. ఇటు వైఎస్సార్‌సీపీ కూడా పోటీగా ప్రచారం చేయగా.. చివరి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిఠాపురంలో వంగా గీత తరఫున ప్రచారం నిర్వహించారు. పిఠాపురంలో గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంను చేస్తానని స్వయంగా జగన్ ప్రకటించారు. మరి పిఠాపురంలో గెలుపు ఎవరిదో తేలాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.