ఏపీలో రైలు ప్రయాణికులకు శుభవార్త.. వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. గుంటూరు మీదుగా సికింద్రాబాద్, సంబల్‌పూర్‌కు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జూన్ 3, 10 తేదీల్లో (సోమవారం) రాత్రి 9 గంటలకు.. సంబల్‌పూర్ - సికింద్రాబాద్ రైలు (08325) బయల్దేరి.. మంగళవారం మధ్యాహ్నం 1.30కి గుటూరు వస్తుంది. ఆ తర్వాత సత్తెనపల్లికి 2.15కు, నడికుడి 3 గంటలకు, సికింద్రాబాద్ రాత్రి 9.50కి చేరుకుంటుంది. సికింద్రాబాద్ - సంబల్‌పూర్ రైలు (08326) జూన్ 4, 11 తేదీల్లో(మంగళవారం) రాత్రి 11.35కి బయల్దేరుతుంది.. బుధవారం వేకువజామున 3.34కి సత్తెనపల్లి, గుంటూరు 4.35 గంటలకు, సంబల్‌పూర్ రాత్రి 11.45కి చేరుకుటందని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే సాంకేతిక కారణాలతో గుంటూరు - డోన్ ఎక్స్‌ప్రెస్ (17228)ని జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. డోన్ - గుంటూరు ఎక్స్‌ప్రెస్ (17227) జూన్ 2 నుంచి జులై 1వ తేదీ వరకు రద్దు చేసినట్లు ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు ఈ విషయాలను గమనించాలని సూచించారు. ప్రత్యేక రైళ్లు సేవల్ని ఉపయోగించుకోవాలని సూచించారు.
ఇదిలా ఉంటే.. రైల్వే గేటు సిగ్నల్ వ్యవస్థ పని చేయకపోవడంతో.. రేపల్లె నుంచి తెనాలి వెళ్లే ప్యాసింజర్ రైలు బాపట్ల జిల్లా వేమూరు రైల్వేస్టేషన్‌లో గంట పాటు నిలిచిపోయింది. ఈ రైలు రేపల్లెలో మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరింది.. అక్కడి నుంచి వేమూరు చేరే సరికి 3.59 గంటలు అయ్యింది. అయితే రైలు వేమూరు నుంచి తెనాలి వెళ్లాలంటే స్టేషన్‌కు కొద్దిదూరంలో ఉన్న లెవల్ క్రాసింగ్ గేటు దగ్గర సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో ఆ సిగ్నల్ పనిచేయలేదు. ఈ కారణంగా అధికారులు రైలును స్టేషన్‌లోనే గంటపాటు నిలిపివేయాల్సి వచ్చింది. ఓ వైపు ఎండు, వేడిగాలులు, ఉక్కపోతతో ఇబ్బందిపడ్డారు. ఆ వెంటనే రైల్వే సిబ్బంది సిగ్నల్ వ్యవస్థకు మరమ్మతు చేయగా.. సిగ్నల్ ఇవ్వడంతో సాయంత్రం 4.57 గంటలకు రైలు కదిలి వెళ్లిపోయింది.