2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో డబ్బు, మద్యం ఏరులై పారాయి. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని రాజకీయ పార్టీలు. పోలింగ్ సందర్భంగా డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే 2019 ఏపీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడినట్లు ఏపీ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు పూర్తి వివరాలతో ప్రకటన విడుదల చేశారు. ఏపీలో ఎన్నికల సందర్భంగా ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పుదుచ్చేరిల నుంచి భారీమొత్తంలో నగదు, మద్యం, డ్రగ్స్.. ఏపీలోకి తీసుకువచ్చే ప్రయత్నం జరిగినట్లు ఏపీ పోలీసులు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, పకడ్బందీ తనిఖీల కారణంగా పెద్దమొత్తంలో నగదు, డ్రగ్స్, మద్యం సీజ్ చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మొత్తం 150 బోర్డర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పుదుచ్చేరిల నుంచి వచ్చే వాహనాలు, వ్యక్తులను తనిఖీ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్, సెబ్, వాణిజ్య పన్నుల శాఖ, రెవెన్యూ, రవాణా శాఖల సమన్వయంతో దాడులు చేశారు. 35 మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు, 15 తాత్కాలిక చెక్ పోస్ట్‌లలో నిఘా ద్వారా భారీ మొత్తంలో నగదు, డ్రగ్స్, మద్యం సీజ్ చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది. పట్టుబడిన నగదు విషయానికి వస్తే 2019 ఎన్నికల సమయంలో 41.80 కోట్ల నగదు సీజ్ చేయగా.. 2024 ఎన్నికలలో 107.96 కోట్లు నగదును పోలీసులు సీజ్ చేశారు. అలాగే సరైన పత్రాలు లేకుండా నగదు సరఫరా చేస్తున్న 7,305 మందిని అరెస్ట్ చేశారు.
మరోవైపు 2019 ఏపీ ఎన్నికల సమయంలో 8.97 కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకుంటే.. 2024 ఎన్నికల సందర్బంగా 58.70 కోట్ల విలువైన మద్యం సీజ్ చేశారు. ఈ ఘటనల్లో 61, 543 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 2019 ఎన్నికలలో రూ. 5.04 కోట్లు విలువైన మాదకద్రవ్యాలను సీజ్ చేస్తే.. 2024 ఎన్నికల సందర్బంగా 35.61 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు. అలాగే డ్రగ్స్ తరలిస్తున్న 1730 మందిపై కేసులు నమోదుచేసి అరెస్ట్ చేసినట్లు ఏపీ పోలీస్ శాఖ ప్రకటించింది. మొత్తంగా 2019 ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికల సందర్బంగా ఏపీలో రెట్టింపు మొత్తంలో నగదును పోలీసులు సీజ్ చేశారు. అలాగే మద్యం ఆరు రెట్లు, డ్రగ్స్ ఏడు రెట్లు ఎక్కువగా సీజ్ చేశారు.