పల్నాడు జిల్లా మాచర్ల మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతం వీడారు. ఆయన మంగళవారం అర్ధరాత్రి పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ప్రతి రోజూ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేయాలన్న హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో.. ఆయన ఎస్పీ ఆఫీస్‌కు రావడం విశేషం. ఏపీ హైకోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై నమోదైన కేసుల్లో జూన్ 6 వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.
ఏపీ హైకోర్టు పిన్నెల్లికి కీలక షరతుల్ని విధించింది. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో పిన్నెల్లి ప్రతి రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5లోపు హాజరు కావాలని ఆదేశించింది. ఆయన నరసరావుపేట దాటి వెళ్లకూడదని.. స్థానికంగా ఎక్కడ ఉంటున్నారో పల్నాడు జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వాలని కోర్టు చెప్పింది. కోర్టు అనుమతి లేకుండా పిన్నెల్లి దేశం దాటి వెళ్లొద్దని.. తన పాస్‌పోర్టును గురజాల మేజిస్ట్రేట్ కోర్టులో అప్పగించాలని కోర్టు ఆంక్షలు విధించింది. ఒకవేళ ఈ షరతుల్ని ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని కోర్టు పోలీసులకు వెసులుబాటు ఇచ్చింది.
పోలీసు అధికారులతో పిన్నెల్లి కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచేలా ఉత్తర్వులు జారీచేయాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు ఎలాంటి నేరపరమైన కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకూడదని.. మళ్లీ నేర ఘటనలను పునరావృతం చేయొద్దని కోర్టు తీర్పులో పేర్కొంది. పిన్నెల్లి పల్నాడు జిల్లాలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు సృష్టించొద్దని.. అనుచరుల నియంత్రణ, ప్రశాంత వాతావరణం, బాధితుల్ని ఇబ్బందిపెట్టకుండా చూసే బాధ్యతు కూడా ఆయనదే అని కోర్టు తెలిపింది. పిన్నెల్లి కేసులకు సంబంధించిన అంశాలను మీడియాతో మాట్లాడకూడదని.. బాధితులతో పాటుగా సాక్షుల్ని కూడా కలవడానికి వీల్లేదు.. వారిని భయపెట్టడం వంటివి చేయకూడదని కోర్టు ఆదేశించింది.
పిన్నెల్లి నరసరావుపేటలో మాత్రమే ఉండాలని కోర్టు ఆదేశించింది.. ఆయన ఓట్ల లెక్కింపు కేంద్రానికి మాత్రం వెళ్లొచ్చని కోర్టు చెప్పింది. అయితే జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉండటంతో.. ఆ ఒక్కరోజు మాత్రం పల్నాడు జిల్లా ఎస్పీ కాకుండా.. ఆర్వో (రిటర్నింగ్ ఆఫీసర్) ముందు హాజరయ్యేలా వెసులుబాటు కల్పించింది. ఈ కేసుల్లో బాధితులకు రక్షణ కల్పించాలని.. వారికి గస్తీ ఏర్పాటు చేయాలని.. అందుకు తగిన విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేతలు బాధ్యతాయుతంగా ఉండాలని.. ఈ విషక్ష్ంలో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించారు న్యాయమూర్తి.
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లిపై ఒక కేసు నమోదైంది. అదే ఘటనలో పిన్నెల్లిని అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదు చేశారు. పాల్వాయిగేగు ఘటనలోనే చెరుకూరి నాగశిరోమణి అనే మహిళ ఫిర్యాదుతో ఇంకో కేసు నమోదైంది. పోలింగ్ మరుసటిరోజు కారంపూడిలో జరిగిన ఘటనల్లో సీఐ టీపీ నారాయణస్వామిపై దాడి ఘటనలో మరో హత్యాయత్నం కేసు నమోదైంది. ఇలా తాజాగా మూడు కేసులు నమోదయ్యాయి.. ఈవీఎం ధ్వంసం కేసుతో కలిపి నాలుగు కేసులు ఉన్నాయి. ఈ నాలుగు కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.