ఒడిశా రాష్ట్రానికి చెందిన సునీత జీవితం కష్టాల కడలి. పుట్టుకతోనే మూగ, చెవిడు వైకల్యాలు ఆమెను చుట్టుముట్టాయి. పేదరికం ఒకవైపు వేధిస్తుంటే, మరోవైపు శారీరక ఎదుగుదల లేక 15 ఏళ్ల వయసులోనూ కేవలం 1.5 అడుగుల ఎత్తుతో ఆమె చిన్నారిలాగే కనిపిస్తుంది. 12 ఏళ్ల క్రితమే తండ్రిని కోల్పోయి అనాథగా మిగిలినా, తల్లి అండతో తనలోని లోపాలను అధిగమించి విద్యావంతురాలు కావాలనే బలమైన సంకల్పంతో ముందుకు సాగుతోంది.
శారీరక వైకల్యం ఆమె శరీరాన్ని బంధించగలిగిందేమో కానీ, ఆమె మేధస్సును, ఆశయాన్ని మాత్రం ఆపలేకపోయింది. ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు హాజరవుతూ సునీత అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మాటలు రాకపోయినా, వినికిడి శక్తి లేకపోయినా తనలోని జ్ఞానాన్ని అక్షర రూపంలోకి మార్చడానికి ఆమె అలుపెరగని పోరాటం చేస్తోంది. తన తల్లి చంకన చేరి పరీక్షా కేంద్రానికి వస్తున్న ఆమె దృశ్యం చూసేవారి కళ్లను చెమర్చుతున్నాయి.
ఈ పరీక్షల్లో సునీత తన ప్రతిభను చాటుకోవడానికి ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. తనకు తెలిసిన సమాధానాలను సైగల ద్వారా వివరిస్తుంటే, ఆమె తరపున మరొక విద్యార్థి (Scribe) పేపర్ పైన సమాధానాలను రాస్తున్నారు. భాష అవరోధమైనా, శారీరక స్థితి సహకరించకపోయినా, తన మేధస్సులోని ఆలోచనలను ఇతరుల సహాయంతో పేపర్ మీద పెట్టిస్తూ విద్య పట్ల తనకున్న మక్కువను చాటుకుంటోంది.
సునీత పట్టుదల నేటి యువతకు ఒక గొప్ప పాఠం. వనరులు లేవని, అదృష్టం బాలేదని కుంగిపోయే వారికి ఆమె ఒక సజీవ స్ఫూర్తి ప్రదాత. కటిక పేదరికం, తండ్రి లేని లోటు, శారీరక వైకల్యం వంటి ఎన్ని అవరోధాలు ఎదురైనా 'చదువు' అనే ఆయుధంతో తన భవిష్యత్తును వెతుక్కుంటున్న ఈ చిన్నారికి ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేయాల్సిందే. ఆమె ఆశయం నెరవేరి మరెందరికో మార్గదర్శిగా నిలవాలని ఆకాంక్షిద్దాం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa