విజయవాడ గవర్నర్‌పేట-1 డిపో డ్రైవర్ సీహెచ్‌ఎస్ రావుపై గుర్తుతెలియని దుండగులు బుధవారం పాశవికంగా దాడి చేశారు. డిపో గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ (డీజీటీ) వాహనం బుధవారం అన్‌లోడింగ్ చేయటానికి ఇబ్రహీంపట్నం వచ్చింది. అన్‌లోడింగ్ పూర్తయ్యాక ఈ వాహనం విజయవాడ బయల్దేరింది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం రింగ్ దాటాక ఎదురుగా వెళ్తున్న ఓ ద్విచక్రవాహనాన్ని డీజీటీ ఓవర్‌టేక్ చేసింది. కాగా, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులు డీజీటీ బస్సును ఆపి డ్రైవర్ సీహెచ్‌ఎస్ రావుపై దాడి చేశారు. డ్రైవర్ కేకలు వేయటంతో ఆ ముగ్గురు ఇంకా రెచ్చిపోయారు. డీజీటీ బస్సులో ఎవరూ లేకపోవటంతో పిడిగుద్దులు కురిపించారు. అంతటితో వదిలిపెట్టకుండా ఓ యువకుడు డ్రైవర్ క్యాబిన్‌లో ఉన్న కటింగ్ బ్లేర్‌ను, మరో యువకుడు స్ర్కూ డ్రైవర్‌ను తీసుకుని పాశవికంగా డ్రైవర్ తలపై దాడి చేశారు. కటింగ్ బ్లేర్‌తో యువకుడి తలపై కొట్టగానే డ్రైవర్ అమాంతం కింద పడిపోయాడు. మళ్లీ పైకి లేపి సీటులో కూర్చోబెట్టి స్ర్కూ డ్రైవర్‌తో తలపై పొడిచారు. దీంతో డ్రైవర్‌కు తీవ్ర రక్తస్ర్తావమైంది. కొట్టొద్దని కాళ్లు పట్టుకున్నా వినలేదు. చేతులతో, కాళ్లతో విచక్షణారహితంగా కొట్టారు. అచేతనంగా పడిపోయాక వదిలిపెట్టారు. ఆ తర్వాత ఆ ముగ్గురు నందిగామ వైపు పారిపోయారు. ఈ విషయాన్ని స్థానికులు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావటంతో డ్రైవర్‌ను అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ను అధికారులు, యూనియన్ నాయకులు పరామర్శించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం వెతుకుతున్నారు.