మద్యానికి డబ్బు ఇవ్వలేదన్న ఆగ్రహంతో కన్నతల్లిని కొడుకు దారుణంగా గొడ్డలితో నరికి చంపిన ఘటన ఎ.కొండూరు మండలం వల్లంపట్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వల్లంపట్ల గ్రామానికి చెందిన శ్రీకాకుళపు వెంటేశ్వరరావు మద్యానికి, చెడు అలవాట్లకు బానిసయ్యాడు. కాగా, తల్లి బుజ్జమ్మకు (63) ఇటీవల కొంత నగదు చేతికందింది. దీంతో ఆ డబ్బును ఎలాగైనా తీసుకోవాలనుకున్న వెంకటేశ్వరరావు బుధవారం తల్లి వద్దకు వచ్చి మద్యం తాగడానికి డబ్బు ఇవ్వాలని అడిగాడు. ఇందుకు బుజ్జమ్మ నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన వెంకటేశ్వరరావు సమీపంలో ఉన్న గొడ్డలితో తల్లి తలపై నరికాడు. ఈ దాడిలో బుజ్జమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న తిరువూరు సీఐ అబ్ధుల్ నబీ, ఎ.కొండూరు ఎస్సై చల్లా కృష్ణ ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.