అనకాపల్లి జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేడి వాతావరణం కొనసాగింది. బుధవారం జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో 38 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎండలు, ఉక్కపోతలకు జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎండలతో పాటు ఉక్కపోత ఉండడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడ్డారు. నిత్యం రద్దీగా ఉండే అనకాపల్లి మెయిన్‌రోడ్డు మధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా కనిపించింది. చోడవరంలో ఉదయం 7 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపడంతో జనం బయటకు రావడానికి వెనుకంజ వేశారు. రావికమతంలో ఉదయం 9 దాటిన తరువాత జనం ఇళ్లకే పరిమితమయ్యారు. మాడుగులలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. నర్సీపట్నంలో ఎండ, ఉక్కపోతకు జనం అల్లాడిపోయారు. కోటవురట్లలో ఉదయం 10 గంటల నుంచే ప్రధాన రహదారులు సైతం నిర్మానుష్యంగా కనిపించాయి. నక్కపల్లిలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంది. పాయకరావుపేటలోనూ ఇదే పరిస్థితి ఉంది.