ఈ నెల 4వ తేదీన జరగనున్న కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమవుతుందని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. కౌంటింగ్ కోసం 1075 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, 144 సెక్షన్ అమలులో ఉంటుందని, లిక్కర్ షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, కౌంటింగ్ హాలులోకి ఏజెంట్లు, సిబ్బంది మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళకూడదని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ.. కౌంటింగ్ సెంటర్ వద్ద మూడంచెల భద్రత ఉంటుందని, పాస్‌లు ఉన్న వారినే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఇస్తామని తెలిపారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తుషార్ డూడీ స్పష్టం చేశారు.