బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌పై దాడి చేసేందుకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరులు పక్కాగా ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనను సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు జరుపుతున్న ముంబై పోలీసులు.. ఈ ఘటన వెనుక ఉన్న కుట్రను ఛేదించే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. సల్మానా ఖాన్ కదలికలపై నిఘా పెట్టినట్లు సమాచారం.
అయితే ఏప్రిల్‌లో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల సందర్భంగా లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్.. పెట్టిన పోస్ట్ తీవ్ర వైరల్‌గా మారింది. ‘ఇది ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా’ అంటూ అన్మోల్ చేసిన పోస్ట్ సంచలనం సృష్టించింది. తాజా పరిణామాలు చూస్తుంటే అన్మోల్ భారీ కుట్రకు తెరతీసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సల్మాన్ ఖాన్ లక్ష్యంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. పక్కా ప్లాన్‌తో హత్యకు చేసేందుకు కుట్రలు పన్నుతున్నట్లు తెలిసింది.
సల్మాన్ ఖాన్ హత్య కోసం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగా పాక్ ఆయుధాల సప్లయర్ నుంచి.. ఏకే-47, ఎం-16, ఏకే-92 తుపాకులు.. హై-కాలిబర్ ఆయుధాలను తెప్పించినట్లు తెలుస్తోంది. ఆ ఆయుధాలతో సల్మాన్ ఖాన్ కారును చుట్టుముట్టి కాల్పులు చేయడం.. అది వీలు కాకపోతే పన్వేల్‌లోని సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించాలని వారు ప్లాన్ చేసినట్లు ముంబై పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఇక సల్మాన్ ఖాన్ హత్యకు ప్రయత్నించిన బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన నలుగురు వ్యక్తులను నవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతడి సోదరుడు అన్మోల్, మరో గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ సహా 17 మందిపై కేసు పెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పన్వేల్‌లోని సల్మాన్ ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన 20 మంది నివసిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. వీరు నిత్యం రెక్కీ నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఈ ఏడాది జనవరిలో కూడా సల్మాన్‌పై దాడి చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ విఫలయత్నం చేసింది. సల్మాన్‌కు చెందిన పన్వేల్‌లోని అర్పితా ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు దుండగులను సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు పట్టించారు. తాము సల్మాన్ ఫ్యాన్స్ అంటూ అజేష్ కుమార్ ఓం ప్రకాష్ గిల్, గురుసేవక్ సింగ్ తేజ్‌సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు ఫేక్ ఐడీలు చూపించగా.. అనుమానం వచ్చి వారు పోలీసులకు అప్పగించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. అయితే గతంలో రాజస్థాన్‌లో కృష్ణజింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ పేరు బయటకు రావడంతో అప్పటి నుంచి బిష్ణోయ్ గ్యాంగ్ అతడ్ని టార్గెట్ చేసింది.