లోక్‌సభ ఎన్నికల 7 విడతల పోలింగ్ పూర్తి అయింది. ఈ నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని సర్వే సంస్థలు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని పేర్కొంటుండగా.. మరికొన్ని సర్వే సంస్థలు మాత్రం అధికార మార్పు ఖాయమని.. టీడీపీ - జనసేన - బీజేపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తుందని తెలిపాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారిన పిఠాపురం నియోజకవర్గం గురించి ఆరా మస్తాన్ సర్వే కీలక విషయాలు వెల్లడించింది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బంపర్ మెజార్టీతో ఘన విజయం సాధిస్తున్నారని ఆరా మస్తాన్ చెప్పారు. ఇక వైసీపీ తరఫున పోటీ చేసిన వంగా గీతకు పరాభవం తప్పదని తెలిపారు.
ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కూడా ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ వెలువరించారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ తిరిగి అధికార పీఠాన్ని నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు. వైసీపీ 94 నుంచి 104 స్థానాలు సాధిస్తుందని వెల్లడించారు. ఇదే సమయంలో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి 71 నుంచి 81 నియోజకవర్గాలను దక్కించుకుంటుందని చెప్పారు. ఇక వైసీపీ ఓట్ షేర్ 49.41 శాతం ఉంటుందని అంచనా వేయగా.. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి 47.55 శాతాన్ని నిలబెట్టుకుంటుందని వెల్లడించారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ సీట్ల విషయానికి వస్తే అధికార వైసీపీదే హవా కొనసాగుతుందని ఆరా మస్తాన్ సర్వే తెలిపింది. వైసీపీకి 13 నుంచి 15 స్థానాల్లో గెలుస్తుందని చెప్పింది. ఇదే సమయంలో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి 10 నుంచి 12 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించింది.