అనుకున్న సమయానికి ముందే మే 30న కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు... క్రమంగా ముందుకు కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో కేరళవ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, అక్కడ నుంచి కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. వచ్చే రెండు లేదా మూడు రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుతుపవనాలు రాయలసీమ మీదుగా ప్రవేశించి రాష్ట్రమంతా విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది.
మరోవైపు, కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని.., కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో అత్యధికంగా విజయనగరం జిల్లా వీటీ అగ్రహారంలో 83 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఎల్ నినో పరిస్థితులు క్రమంగా బలహీనపడి.. లా నినో ఏర్పడుతోందని, ఈ సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాల పురోగమనం, రెమల్ తుఫాన్ కారణంగా రోహిణీ కార్తె ప్రభావం రాష్ట్రంపై పెద్దగా లేదు. గతవారం రోజుల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం వేడిగాలులు వీస్తున్నాయి.
మరోవైపు, శనివారం చిత్తూరు జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చిత్తూరు, గుడిపాల, వెదురు కుప్పం, కుప్పం, కల్లూరు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పిడుగుపాటుకు ఆవులు, మేకలు మృతి చెందగా.. మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ఉక్కపోతకు జనం అల్లాడిపోయారు.