కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగింపునకు చేరుకోవడంతో పాటు వారాంతం కావడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. సప్తగిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శనివారం సాయంత్రానికి క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనం వద్ద షెడ్లూ నిండిపోయి.. ఆపై ఏటీసీ వరకూ భక్తులు లైన్‌లో వేచి ఉన్నట్లు టీటీడీ తెలిపింది.
శనివారం ఉదయం రింగ్ రోడ్డులోని శిలాతోరణం వరకు భక్తులు లైన్‌లో ఉన్నారు. అయితే, వీఐపీ బ్రేక్ అనంతరం సర్వ దర్శనాలకు భక్తులను అనుమతించడంతో సాయంత్రానికి కొత్త మేర రద్దీ తగ్గింది. మళ్లీ రాత్రికి ఈ సంఖ్య పెరగడంతో శిలాతోరణం వరకూ క్యూలైన్ వచ్చినట్టు పేర్కొంది. ప్రస్తుతం సర్వదర్శనం భక్తులకు 20 నుంచి 24 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 78,686 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీకి రూ.3.54 కోట్ల కానుకలు వచ్చాయి. అలాగే, 37,888 మంది తలనీలాలు సమర్పించారు.
మరోవైపు, తిరుమలలో శనివారం హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా ఉదయం 7 గంటలకు శ్రీసీతారామలక్ష్మణస్వామి ఉత్సవమూర్తులను శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి వేంచేపు చేశారు. ఆంజనేయస్వామివారి మూలవర్లకు, సీతారామ, లక్ష్మణ స్వామివార్ల ఉత్సవర్లకు వైభవంగా అభిషేకం నిర్వహించారు. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు శ్రీ రామచంద్రమూర్తి హనుమంత వాహనంపై విహరించారు. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తాడు.. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు.. దాస్యభక్తికి ప్రతీకగా శ్రీరాముడ్ని హనుమంత వాహనంపై విహరిస్తారు..