వర్షాకాలంలో రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వజ్రాల వేట కోసం పక్క రాష్ట్రాల నుంచి సైతం జనం వస్తుంటారు. ఈ ఏడాది అక్కడ ముందుగానే వజ్రాల వేట మొదలైంది. ఇప్పటికే పలువురు అదృష్టవంతులకు వజ్రాలు దొరికాయి. ఇదిలా ఉండగా.. సముద్ర తీరంలో బంగారం కొట్టుకొస్తుందని జనం ఎగబడుతున్నారు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరానికి బంగారు రేణువులు కొట్టుకొస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానికులు బంగారాన్ని చేజిక్కించుకోడానికి పెద్ద సంఖ్యలో చేరుకుని వేట సాగిస్తున్నారు.
తుఫాస్లు, భారీ వర్షాలు, పోటు సమయంలో సముద్రం అల్లకల్లోంగా మారి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడి.. అవి తీరానికి చేరుకుంటాయి. ఈ సమయంలో అలలతో పాటు ఇసుక, పలు సూక్ష్మజీవులు, ద్రవ, ఘన పదార్థాలు ఒడ్డుకు కొట్టుకొస్తాయి. అలా వచ్చిన ఇసుకలో అప్పుడప్పుడు బంగారు రేణువులూ దొరుకుతాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో కోటలు, పలు ఆలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుఫాను సమయంలో బయటపడుతుంటాయని అంటున్నారు.
గతంలో తుఫాను వచ్చినప్పుడు కోనపాపపేట తీరం ఒడ్డున ఇసుకలో వెండినాణేలు లభ్యమయ్యాయి. ఈ పరిస్థితుల్లో అల్పపీడనాలు సంభవించిన సమయాల్లో కెరటాలు తీవ్రతకు ఒడ్డుకు కొట్టుకువస్తాయని, సముద్రంలో కలిసిపోయిన బంగారు వస్తువుల ముక్కలే ఇలా దొరుకుతాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన రెమల్ తుఫాను కారణంగా ఉప్పాడ తీరంలోకి బంగారు రేణువులు కొట్టుకొచ్చాయని ప్రచారం జరుగుతోంది. దీంతో మత్స్యకారులు, స్థానికులు గత రెండు రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సముద్రం ఒడ్డునే కాలం వెల్లదీస్తున్నారు.