లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ గెలిచి.. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొట్టబోతోందని.. శనివారం విడుదలైన దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. దేశ ప్రజలు ఎన్డీఏ కూటమికే పట్టం కడతారని.. ముక్త కంఠంతో సర్వే సంస్థలు అంచనా వేశాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్‌పై సాధారణంగానే ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమనాథ్ భారతి కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ప్రధానిగా మోదీ అయితే తాను గుండు కొట్టించుకుంటానని పేర్కొన్నారు.
శనివారం సాయంత్రం.. లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ పూర్తి అయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. అయితే దాదాపు అన్ని సర్వే సంస్థలు.. మళ్లీ కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకోనుందని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే ఆప్ నేత సోమనాథ్ భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పు అని జూన్ 4 వ తేదీన రుజువు అవుతుందని ట్వీట్ చేశారు. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కాలేరని అన్నారు. ఒక వేళ మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు గీయించుకుంటానని సంచలన ప్రకటన చేశారు. తన మాటలను గుర్తుపెట్టుకోండని చెప్పారు.
అంతేకాకుండా ఢిల్లీలో ఉన్న మొత్తం 7 లోక్‌సభ స్థానాలను ఇండియా కూటమి గెలుచుకుంటుందని సోమనాథ్ భారతి పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే భయం ఉందని.. అందుకే ఆయన ఓడిపోతారని సర్వే సంస్థలు చెప్పలేదని అన్నారు. కానీ ఓటర్లు మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారని సోమనాథ్ భారతి వెల్లడించారు.
ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ కార్యాలయంలో తయారు చేశారని.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. తమిళనాడులో బీజేపీకి 34 శాతం ఓట్లు వస్తాయంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. అంతేకాకుండా పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్‌కు ఒక్క సీటు రాదంటే ఎలా నమ్మాలని అన్నారు. ఇండియా కూటమి నేతలు పంచుకున్న జనతా కా ఎగ్జిట్ పోల్ ప్రకారం తమ కూటమి 295 కిపైగా స్థానాలను గెలుస్తుంద సంజయ్ సింగ్ తేల్చి చెప్పారు.