రానున్న ఎన్నికల ఫలితాల్లో కూటమి తిరుగులేని విజయం సాధించబోతోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ విడుదల, ఎల్లుండి కౌంటింగ్ నేపథ్యంలో చంద్రబాబు నేడు ఉండవల్లి నివాసం నుంచి కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. పురందేశ్వరి ఈ ఎన్నికల్లో రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయగా, నాదెండ్ల మనోహర్ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేశారు.
ఇక, నేటి వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు కౌంటింగ్ వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అభ్యర్థులకు సూచనలు చేశారు. కూటమి తిరుగులేని విజయం సాధించబోతోందని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారని అభినందించారు. కౌంటింగ్ రోజున అల్లర్లకు పాల్పడేందుకు వైసీపీ ప్రణాళికలు రచిస్తోందని కూటమి నేతలను చంద్రబాబు అప్రమత్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలోనూ కొర్రీలు వేయాలని వైసీపీ చూసిందని అన్నారు. అందుకే, ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని, డిక్లరేషన్ ఫారం తీసుకున్నాకే అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి రావాలని స్పష్టం చేశారు.