అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడి సుమారు రూ.17లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన పరవాడ దేశపాత్రునిపాలెంలో చోటు చేసుకుంది. రాత్రి వేళ కారులో వచ్చి గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేసి దొంగతానికి పాల్పడ్డారు. గాజువాక- ఎలమంచిలి రోడ్డులోని ఎస్‌బీఐ ఏటీఎంలో అర్ధరాత్రి 2నుంచి 3:30గంటల సమయంలో చోరీ జరిగినట్లు పరవాడ సీఐ బాలసూర్యారావు తెలిపారు. ముందుగా సీసీ కెమెరాల తీగలు కత్తరించి లోపలికి ప్రవేశించిన దొంగలు.. అనంతరం గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కోసి అందులోని రూ.17లక్షలు ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న మరో ఏటీఎంలోని నగదు మాత్రం అలానే ఉంది. ఎవరూ తమను గుర్తించకుండా 6సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. గ్యాస్ కట్టర్లతో కాల్చివేయడంతో అందులో ఎటువంటి ఫుటేజ్ రికార్డు కాలేదు. ఘటనా స్థలాన్ని, చోరీ జరిగిన తీరును పరవాడ డీఎస్పీ కె.వి. సత్యనారాయణ పరిశీలించారు. వేకువజామున 2నుంచి 3.30గంటల ప్రాంతంలో దొంగతనం జరిగినట్లు స్థానికులు గుర్తించారు. ఏటీఎం లోపల నుంచి ఇద్దరు వ్యక్తులు బ్యాగులతో వచ్చి కారులో వెళ్లిపోయినట్లు స్థానికుడు చెప్పినట్లు సీఐ వెల్లడించారు. ఏటీఎం నిర్వహణ సంస్థ ప్రతినిధి పాలకుర్తి శ్రీనివాస్ అప్పారావు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలసూర్యారావు పేర్కొన్నారు.