వైసీపీ పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో దిగాలని భావించినప్పటికీ ఆఖరి నిమిషంలో అనూహ్యంగా కొట్టగుళ్లి భాగ్యలక్ష్మికి టికెట్ దక్కింది. దీంతో మత్స్యరాస విశ్వేశ్వరరాజు సతీమణి కిముడు శివనాగరత్నంకు జీకేవీధి జడ్పీటీసీ టికెట్ ఇవ్వడంతో పాటు ఆయనను ఎస్‌టీ కమిషన్ సభ్యుడిగా వైసీపీ ప్రభుత్వం నియమించింది. అలాగే సిటింగ్ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని పక్కన పెట్టి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా మత్స్యరాస విశ్వేశ్వరరాజును బరిలో దింపారు. ఆయనకు సీనియర్ వైసీపీ నేతలు సహకరించనప్పటికీ, నియోజకవర్గంలోని వైసీపీకి వున్న బలం నేపథ్యంలో ఆయన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరికి 47,468 ఓట్లు రాగా, విశ్వేశ్వరరాజుకు 67,333 ఓట్లు దక్కాయి. దీంతో 19,865 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. తొలి ప్రయత్నంలోనే విశ్వేశ్వరరాజు ఎమ్మెల్యేగా విజయం సాధించడంపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి సైతం వైసీపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో గిడ్డి ఈశ్వరి పోటీ చేసినప్పడు 26,349 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 47,468 ఓట్లు సాధించారు. అంటే గత ఎన్నికలతో పోలిస్తే 21,119 ఓట్లు టీడీపీకి అధికంగా వచ్చాయని తెలుస్తున్నది. అలాగే స్వతంత్ర అభ్యర్థి వంతాల సుబ్బారావు సైతం 15,893 సాధించగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సతకా బుల్లిబాబు 13,271 ఓట్లు దక్కించుకోవడం విశేషం.