ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఈసారి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ ఘోర పరాజయం పాలయ్యారు. మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదమూడుచోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించగా, అరకు, పాడేరుల్లో మాత్రం వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముగ్గురూ మరోసారి విజయ శిఖరాలను చేరుకున్నారు. వీరిలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భీమిలిలో వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుపై భారీ మెజారిటీతో గెలుపొందారు. తూర్పు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై విజయం సాధించగా, గాజువాక నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్...టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు చేతిలో చిత్తుగా ఓటమి పాలయ్యారు. దక్షిణ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ (గత టీడీపీ తరపున పోటీ చేసిన తరువాత వైసీపీ పంచన చేరారు)పై 64,594 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉత్తర నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే, కూటమి అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు 60,295 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి కేకే రాజుపై విజయం సాధించారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్‌కుమార్‌పై విజయం సాధించారు. పెందుర్తి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ తన ప్రత్యర్థి, జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబు చేతిలో ఓటమి పాలయ్యారు. పాయకరావుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే (గత ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి గెలుపొందారు) కంబాల జోగులు...టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. చోడవరంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, టీడీపీ అభ్యర్థి కేఎస్‌ఎన్‌రాజు చేతిలో ఓటమిపాలయ్యారు. మాడుగుల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి బూడి ముత్యాలనాయుడు కుమార్తె ఈర్లె అనూరాధ...టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి చేతిలో ఓటమిపాలయ్యారు. నర్సీపట్నం నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్...తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతితో పరాజయం పాలయ్యారు. ఎలమంచిలిలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబురాజు...కూటమి అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్ చేతిలో ఓడిపోయారు. అలాగే మంత్రి, మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు.