ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పర్వం ముగిసింది. ఒకట్రెండు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. టీడీపీ నేతృత్వంలో జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. ఇక ఎన్నికల్లో ఘనవిజయం సాధించేందుకు సహాయపడిన నేతలు.. టికెట్ రాకపోయినా కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేసిన లీడర్లు.. నామినేటెడ్ పదవుల కోసం తమ వంతు ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్లు సమాచారం. ఎన్నికల సందర్భంగా టికెట్ దక్కని నేతలకు.. ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నామినేటేడ్ పదవులు, ఎమ్మె్ల్సీలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటుగా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా కొంతమందికి హామీలు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటుకానున్న నేపథ్యంలో నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది.
ఈ క్రమంలోనే టీటీడీ ఛైర్మన్ పదవి ఎవరు చేపడతారనే దానిపై రోజుకోపేరు తెరపైకి వస్తోంది. మొన్నటి వరకూ తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కొనసాగారు. అయితే 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవటంతో భూమన తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఈ పదవి ఎవరికి దక్కుతుందనేదీ ఆసక్తికరంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు.. ఈ పదవి చేపడతారనే వార్తలు తొలుత వచ్చాయి. ఇప్పుడేమో అనూహ్యంగా ముగ్గురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. వారిలో కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, పూసపాటి అశోక్ గజపతిరాజు, పిఠాపురం నియోజకవర్గం టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ, టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
పూసపాటి అశోక్ గజపతిరాజు ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. విజయనగరం ఎమ్మెల్యే స్థానం నుంచి తన కుమార్తె అదితి గజపతిరాజును టీడీపీ తరుఫున పోటీ చేయించి గెలిపించుకున్నారు. అయితే ఆయన పేరు కూడా టీటీడీ ఛైర్మన్ పదవి కోసం వినిపిస్తోంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన పిఠాపురం ఎస్వీఎస్ఎన్ వర్మ పేరు కూడా వినిపిస్తోంది. పవన్ కోసం సీటు వదులుకున్నందుకు ఎమ్మెల్సీని చేస్తామని చంద్రబాబు అప్పట్లో వర్మకు హామీ ఇచ్చారు. మరి హామీ మేరకు ఎమ్మెల్సీని చేస్తారా.. లేదా టీటీడీ ఛైర్మన్ పదవిలో నియమిస్తారో చూడాల్సి ఉంది.
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీ అభ్యర్థి వంగా గీత మీద రికార్డు మెజారిటీతో గెలుపొందారు. ఏకంగా 70 వేల మెజారిటీతో పవన్ గెలుపొందారు. అయితే పవన్ కళ్యాణ్ విజయం కోసం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా కృషి చేశారు. దీంతో హామీ మేరకు వర్మకు గౌరవమైన పదవి కట్టబెట్టాలని పిఠాపురం టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి.