జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎన్డీఏ కూటమిలోని పార్టీల అధినేతలు అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. జనసేనానిపై ఓ రేంజులో ప్రశంసలు కురిపించారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్.. ఆయన పవన్ కాదు తుపాను అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అద్భుత విజయం సాధించామన్న నరేంద్ర మోదీ.. ఏపీలో విజయం ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించిందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో కలిసి అద్భుత విజయం దక్కించుకున్నామని చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు వలనే భారీ విజయం దక్కిందన్నారు. మరోవైపు ఈ సమావేశంలోనే ఎన్డీఏ కూటమి లోక్‌సభా పక్షనేతగా మోదీని ఎన్నుకున్నారు.
మరోవైపు ఈ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. ఎన్నికల ప్రచార సమయంలో మోదీ బాగా కష్టపడ్డారన్న చంద్రబాబు.. ఏపీలోనూ బహిరంగసభలు, ర్యాలీలో పాల్గొన్నారని చెప్పారు. మోదీ నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసిందని.. ప్రపంచంలోనే భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చంద్రబాబు కొనియాడారు. మోదీ నేతృత్వంలో దేశంలో పేదరికం అంతమవుతుందన్న చంద్రబాబు నాయుడు.. 2047 నాటికి నంబర్ వన్ అవుతుందని ఆకాంక్షించారు.
మరోవైపు ప్రధానమంత్రి నేతృత్వంలో ఆయన బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. మోదీ నాయకత్వానికి జనసేన పార్టీ మద్దతిస్తుందని అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరికీ నరేంద్ర మోదీ స్ఫూర్తిగా నిలిచారన్న పవన్ కళ్యాణ్.. మోదీ ప్రధానిగా ఉన్నంతవరకు ఏ దేశానికీ భారత్ తలొగ్గదని స్పష్టం చేశారు. మోదీ నేతృత్వంలో పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు.