ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సునామీ కనిపించింది. కూటమి ఏకంగా 8 జిల్లాలను క్లీన్ స్వీప్ చేసింది.. ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు ఏకంగా 90వేలకుపైగా మెజార్టీతో విజయం సాధించారు. ఈసారి విచిత్రంగా రాయలసీమలోని అనంతపురం జిల్లా క్లీన్ స్వీప్ కాగా.. చిత్తూరు జిల్లాలో కూటమి రెండు సీట్లలో ఓడింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఎన్నికల కౌంటింగ్ ముగియగా.. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీల వారీగా వచ్చిన ఓట్లు.. ఓట్లశాతం వివరాలు కూడ వచ్చేశాయి. కూటమికి రికార్డ్ స్థాయిలో ఓటింగ్ శాతం వచ్చింది.
ఏపీ ఎన్నికల్లో కూటమికి కోటి 86లక్షల 56వేల 300 ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. వీటిలో టీడీపీకి కోటి 53లక్షల 84వేల 576 ఓట్లు రాగా.. జనసేన పార్టీకి 23లక్షల 17వేల 747 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 9లక్షల 53వేల 957 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్‌సీపీకి కోటి 32 లక్షల 84వేల 134 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 5లక్షల 80వేల 613 మంది ఓట్లు వేయగా.. నోటాకు 3లక్షల 96వేల 320మంది ఓట్లు వేశారు. ఇక ఓట్లశాతం విషయానికి వస్తే.. కూటమికి ఓవరాల్‌గా 55.29శాతం వస్తే.. అందులో టీడీపీకి 45.6శాతం, జనసేనకు 6.86శాతం, బీజేపీకి 2.83శాతం ఓట్లు దక్కాయి. వైఎస్సార్‌సీపీకి 39.37శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు 1.72శాతం, నోటాకు 1.09శాతం ఓట్లు వెళ్లాయి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రద్దయ్యింది. మంగళవారం ఎన్నికల ఫలితాలు రావడంతో.. ప్రస్తుత 15వ అసెంబ్లీని రద్దు చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్‌నజీర్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. కేబినెట్ (మంత్రి మండలి) సిఫార్సు మేరకు రాజ్యాంగంలోని 174 (2) (బి) నిబంధన ప్రకారం అసెంబ్లీని గవర్నర్ రద్దు చేశారు. గవర్నర్ పేరుతో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేశారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు. త్వరలోనే 16వ అసెంబ్లీలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.