టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం, వేదిక ఖరారయ్యాయి. ఈ నెల 12వ తేదీ ఉదయం 11.27కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అనేక ప్రాంతాలు పరిశీలించిన టీడీపీ నేతలు.. చివరకు కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి.
మరోవైపు జూన 9వ తేదీనే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే అదేరోజు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. చివరకు జూన్ 12వ తేదీ మంచి ముహూర్తం ఉండటంతో.. పార్టీ వర్గాలు ఆ రోజును ఖరారుచేశాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటుగా ఎన్డీఏ కూటమిలోని పలు పార్టీల నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 135 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోగా.. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. జనసేన, బీజేపీలతో కలిసి కూటమిగా ఎన్నికల బరిలోకి దిగిన చంద్రబాబు సూపర్ సక్సెస్ అయ్యారు. టీడీపీకి వచ్చిన 135 ఎమ్మెల్యే సీట్లతో పాటుగా జనసేనకు 21 సీట్లు, బీజేపీ 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించింది. దీంతో వీరందరినీ కలుపుకుంటే టీడీపీ కూటమి బలం 164 స్థానాలకు చేరనుంది. మరోవైపు ప్రమాణ స్వీకారం ముహూర్తం, వేదిక కూడా ఖరారైన నేపథ్యంలో మంత్రివర్గం కూర్పుపైనా అధినేత చంద్రబాబు దృష్టి సారించినట్లు తెలిసింది. అలాగే ఆశావహుల సంఖ్య కూడా భారీగా ఉన్నట్లు సమాచారం. అయితే సామాజికవర్గ సమీకరణాల ఆధారంగా మంత్రిపదవులు కేటాయించే చంద్రబాబు.. ఈసారి కూడా అదే ఫార్ములాను ఫాలో అవనున్నట్లు సమాచారం.