ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడక్కడా ఉద్రిక్తతలు, దాడులు జరుగుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల నేతలను, శ్రేణులను రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. పలుచోట్ల టీడీపీ శ్రేణులు, వైసీపీ లీడర్లు, శ్రేణులను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తుండగా.. కొన్నిచోట్ల వైసీపీ శ్రేణుల నుంచి కూడా ఇదే తరహా కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు, అభిమానులకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. అందరూ సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.
ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడక్కడా జరుగుతున్న కవ్వింపు చర్యలు, దాడులపై చంద్రబాబు ఆరా తీశారు. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన ఉద్రిక్తతలు, ఘర్షణలపై పార్టీ శ్రేణుల నుంచి చంద్రబాబు సమాచారం తెప్పించుకున్నారు. వైసీపీ కవ్వింపు చర్యలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించిన టీడీపీ అధినేత.. నేతలకు సైతం పలు కీలక సూచనలు చేశారు. దాడులు, ప్రతిదాడులు జరగకుండా ఎమ్మెల్యేలు, నేతలు చూడాలని ఆదేశించారు. టీడీపీ క్యాడర్ మొత్తం సంయమనంతో వ్యవహరించాలని.. ప్రత్యర్థి పార్టీ రెచ్చగొట్టినా.. పూర్తి సంయమనంతో వ్యవహరించాలన్నారు. ఇదే సమయంలో పోలీసులకు సైతం పలు సూచనలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు గట్టిచర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు శుక్రవారం గన్నవరం, విజయవాడ, గుడివాడలో ఉద్రిక్తతలు తలెత్తాయి. గుడివాడలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని.. ఇంటిపై టీడీపీ శ్రేణులు కోడిగుడ్లు విసిరారు. ఆయన ఇంటి ముందు నినాదాలు చేశారు. అయితే పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. అటు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైనా కొంతమంది దాడికి యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. వంశీ నివాసముండే అపార్ట్‌మెంట్ వద్దకు భారీగా చేరుకున్న టీడీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. గేటు పగులగొట్టి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సెల్లార్‌లో ఉన్న కార్లపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనతో అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. విజయవాడలోని దేవినేని అవినాష్ ఇంటిపై దాడిచేస్తారనే అనుమానంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.