ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉన్న వాసుదేవరెడ్డి ఇంట్లో సీఐడీ తనిఖీలు నిర్వహించింది. తనిఖీల సందర్భంగా వాసుదేవరెడ్డి ఇంట్లోని పలు పత్రాలను సీఐడీ అధికారులు పరిశీలించినట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన ఆయన వైసీపీకి లబ్ధి కలిగేలా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక నూతన మద్యం విధానం పేరుతో వైసీపీకి లబ్ధి కలిగించేలా మద్యం సరఫరా చేశారనే ఆరోపణలు వాసుదేవరెడ్డిపై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ పదవి నుంచి వాసుదేవరెడ్డిని ఎన్నికల సంఘం తప్పించింది. వైసీపీకి అనుకూలంగా మద్యం నిల్వలు చేసుకునేలా వారికి సహకరిస్తున్నారంటూ.. అప్పట్లో విపక్ష పార్టీల నేతలు ఆయనపై ఫిర్యాదులు చేశారు.అలాగే బేవరేజెస్ కార్పొరేషన్ ఆదాయాన్ని చూపించి వేల కోట్ల రుణాలు తీసుకోవటం సహా ఆర్థిక అవకతవకలకు కారణమయ్యారంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అప్పట్లో ఆరోపణలు చేశారు. దీనిపై పురందేశ్వరి కేంద్రప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు.
వాసుదేవరెడ్డిపై ఆరోపణలు, ఫిర్యాదులు రావటంతో ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఆయనను పదవి నుంచి తప్పించింది. వేరేశాఖకు బదిలీ చేయాలంటూ ఆదేశించింది. తాజాగా ఎన్నికలు పూర్తై టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే వాసుదేవరెడ్డి నివాసంలో సోదాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.