ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది.. ఈ నెల 11న టీడీఎల్పీ సమావేశం, 12న ముఖ్యమంత్రిగా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటుగా పలువురు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎవరనే చర్చ జరుగుతోంది. స్పీకర్ పదవి కోసం టీడీపీలోని కొందరు నేతలు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి.. వీరిలో సీనియర్లు ఉన్నారు.
స్పీకర్ పదవి రేసులో మొదట ఉన్న వ్యక్తి రఘురామ కృష్ణరాజు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున నరసాపురం నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత కొంతకాలానికే వైఎస్సార్‌సీపీ, అప్పటి సీఎం జగన్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ఆయనపై కేసులు నమోదు కావడంతో.. నాలుగున్నరేళ్లు ఢిల్లీలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన్ను అరెస్ట్ చేసి ఏపీకి తీసుకొచ్చారు.. ఆ సమయంలో తనను పోలీసులు కొట్టారని ఆరోపించారు. అయితే 2024 ఎన్నికలకుముందు టీడీపీలో చేరిన రఘురామ.. ఉండి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే రఘురామ ఉండి నుంచి పోటీచేయడంతో.. ఆయనకు స్పీకర్ పదవి ఇస్తారని టాక్ నడిచింది. దీంతో రఘురామకు స్పీకర్ పోస్ట్ ఖాయమనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఆయన వైపు మొగ్గు చూపుతారని భావిస్తున్నారు.
అలాగే స్పీకర్ రేసులో.. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి గెలిచిన కళా వెంకట్రావు పేరు కూడా వినిపిస్తోంది. మంత్రి బొత్సపై కళా వెంకట్రావు ఘన విజయం సాధించారు. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ఆనం రాం నారాయణ రెడ్డి పేరు స్పీకర్ రేసులో వినిపిస్తోంది. ఆనం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి గెలిచారు. వీరితో పాటుగా కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన మరో ఇద్దరు నేతల పేర్లు కూడా స్పీకర్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు జనసేన, బీజేపీలతో పొత్తు ఉండటంతో.. ఆ పార్టీకి స్పీకర్ పదవి కట్టబెడతారా అనే చర్చ కూడా జరుగుతోంది.
మరోవైపు కూటమిలో జనసేన, బీజేపీ నుంచి మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే చర్చ జరుగుతోంది. బీజేపీ నుంచి రేసులో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణరెడ్డిలు ఉన్నారు. ఇక జనసేన పార్టీ నుంచి పలువురు ఆశావహుల పేర్లు ఉన్నాయి. నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, మండలి బుద్ధప్రసాద్‌తో పాటుగా పలువురు నేతలు పోటీపడుతున్నారు. మరి కూటమిలో మంత్రి పదవుల్ని చంద్రబాబు ఎలా కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటు తెలుగు దేశం పార్టీలో కూడా మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు.