ప్రధానమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు నరేంద్ర మోదీ సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్డీఏ కూటమి ఎంపీలంతా కలిసి ఇవాళ ఢిల్లీలో సమావేశం అయి.. నరేంద్ర మోదీని ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలకు, ఎంపీలకు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ తర్వాత అక్కడ హాజరైన నేతలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ క్రమంలోనే కేబినెట్ బెర్త్‌ల గురించి ఎంపీలను బురిడీ కొట్టించేవారు కూడా ఉంటారని వారిని అలర్ట్ చేశారు. దీంతో ప్రధాని మాటలకు ఎన్డీఏ కూటమి ఎంపీలు అందరూ నవ్వారు.
ప్రస్తుతం ఎంపీలుగా ఎన్నికైన వారికి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. "కొంతమంది మీ దగ్గరకు వచ్చి, కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని.. ఆశ చూపిస్తారు. ప్రస్తుతం టెక్నాలజీ ఏ స్థాయిలో ఉందంటే.. నా డిజిటల్ సంతకంతో ఉన్న మంత్రివర్గ జాబితా బయటకు రావొచ్చు. ఇలాంటి వాటితో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి మాయమాటలకు లొంగిపోవద్దని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ విషయంలో ప్రతిపక్ష కూటమికి డబుల్ పీహెచ్‌డీ ఉంది. వారు తమ నైపుణ్యాలను ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇలాంటి రూమర్స్‌ను పట్టించుకోవద్దు. సంచలనాల కోసం చేసే ఇలాంటి ప్రయత్నాలతో దేశాన్ని నడపించలేం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ నవ్వుతూనే కొత్తగా ఎన్నికైన వారితోపాటు పాత వారికి కూడా సున్నిత హెచ్చరికలు చేశారు. నకిలీ సమాచార వ్యాప్తిని ఉద్దేశించే ఆయన ఈ రకంగా స్పందించారు.
ఇక ఇదే ప్రసంగంలో పలు అంశాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ (NDA) అంటే కొత్త నిర్వచనం చెప్పారు. "న్యూ ఇండియా, డెవలప్‌డ్ ఇండియా, ఆస్పిరేషనల్ ఇండియా" అని కొత్త అర్థం చెప్పారు. ఇదే క్రమంలో ప్రతిపక్ష నేతలపై నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఇప్పటికీ తన శక్తి సామర్థ్యాలను తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదని హేళన చేశారు. మరో 10 ఏళ్లు అయినా ఆ పార్టీ 100 స్థానాల మార్క్‌ను దాటలేదు అని ఎద్దేవా చేశారు.