బస్ కండక్టర్ అంటే చాలా బిజీగా ఉంటాడు. బస్సులో ఎక్కేవారినీ.. దిగేవారినీ చూసుకోవడం.. వారి దగ్గర డబ్బులు తీసుకుని టికెట్లు ఇవ్వడం.. టికెట్లకు సరిపడా చిల్లర ఇవ్వడం.. ఇలా డ్యూటీ ప్రారంభం అయినప్పటి నుంచి.. డ్యూటీ దిగిపోయే సరికి ప్రయాణికులతో పోరాటం చేయాల్సిందే. కనీసం కూర్చుందామనుకునే సరికే.. మరో స్టాప్ రావడంతో బస్సులో ముందుకూ వెనక్కి.. తిరుగుతూనే ఉండాలి. ఇక డబ్బులతో వ్యవహారం కాబట్టి చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి లేకపోతే జీతంలో కోత పడుతుంది. అయితే అంత బిజీలో ఉండి కూడా ఓ బస్ కండక్టర్ చూపించిన సమయస్ఫూర్తితో ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
కేరళలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కేరళ ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు ప్రయాణిస్తున్నాడు. బస్సు వేగంగా వెళ్తుండగా.. అందులో ఉన్న కండక్టర్.. ప్రయాణికుల నుంచి డబ్బులు తీసుకుని టికెట్లు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే మెట్ల వద్ద నిలబడిన ఓ ప్రయాణికుడు పట్టుకోల్పోయాడు. దీంతో కింద పడిపోతుండగా.. టికెట్లు ఇచ్చే బిజీలో ఉన్న ఆ బస్సు కండక్టర్.. చాకచక్యంగా వ్యవహరించి.. ఆ కండక్టర్‌ను చేయి పట్టుకుని రోడ్డుపై పడకుండా కాపాడాడు. దీంతో ఆ ప్రయాణికుడు కింద పడకుండా మెట్లపై ఆగిపోయాడు. దీంతో రెప్పపాటున ప్రాణాలు కాపాడుకున్నాడు.
ఈ తతంగం మొత్తం ఈ బస్సులో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారడంతో నెటిజన్ల నుంచి కామెంట్లు వస్తున్నాయి. మెరుపు వేగంతో ఆ కండక్టర్ ప్రదర్శించిన సమయస్ఫూర్తికి.. నెటిజన్ల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇక ఆ ప్రయాణికుడికి భూమి మీద నూకలు ఉన్నాయ్ కాబట్టే ప్రాణాలతో బయటపడ్డాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరణం అంచుల వరకు వెళ్లి వచ్చాడని పేర్కొంటున్నారు. అయితే ఆ ప్రయాణికుడు పడిపోతుండడాన్ని కనీసం చూడని ఆ కండక్టర్ వెంటనే స్పందించి తన చేతితో ఆ ప్రయాణికుడి చేతిని పట్టుకుని కాపాడటంతో హ్యాట్సాఫ్ అంటూ కొనియాడుతున్నారు. నువ్వు దేవుడివి సామీ అంటూ ఆ కండక్టర్‌ను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.