చిత్ర రంగానికీ, రాజకీయాలకూ విడదీయలేని అనుబంధం ఉంది. సినీ గ్లామర్‌తో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చాలా మంది సక్సెస్ అయ్యారు. ఇక, ఈ లోక్‌సభ ఎన్నికల్లో సినీగ్లామర్‌ను జనం బాగానే ఆదిరించారు. బీజేపీ నుంచి పోటీచేసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, మలయాళ నటుడు సురేశ్ గోపి, డ్రీమ్ గర్ల్ హేమమాలిని వంటి వారు విజయం సాధించారు. వీరితో పాటు తెలుగులో చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన బావగారూ బాగున్నారా సహా పలు తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి రచనా బెనర్జీ కూడా పశ్చిమ్ బెంగాల్‌లోని హుగ్లీ నుంచి విజయం సాధించారు.
మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి పోటీచేసిన రచన.. బీజేపీ నేత లాకెట్ ఛటర్జీని ఓడించారు. మిస్ ఇండియా 1992 పోటీల్లో పాల్గొని ‘మిస్ బ్యూటిఫుల్ స్మైల్’గా నిలిచిన రచన.. సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1993లో ‘దాన్ ప్రతిదాన్’ అనే బెంగాలీ చిత్రంతో తెరంగేట్రం చేసి.. తమిళ్, కన్నడ, హిందీ, ఒరియా సినిమాల్లోనూ నటించారు. ఇక, దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ.. రచనను టాలీవుడ్‌కు పరిచయం చేశారు. 1997లో జేడీ చక్రవర్తి హీరోగా ఈవీవీ దర్శకత్వం వహించిన ‘నేను ప్రేమిస్తున్నాను’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచారు. అయితే, రెండో సినిమా ‘కన్యాదానం’తోనే ఆమె మంచి గుర్తింపు వచ్చింది.
తర్వాత వరుసగా పలు సినిమాల్లో నటించారు. 1998లో జగపతిబాబుతో మావిడాకులు, ఎస్వీ కృష్ణారెడ్డితో అభిషేకం, చిరంజీవితో బావగారూ.. బాగున్నారా?, మోహన్‌బాబుతో రాయుడు, బాలకృష్ణతో సుల్తాన్ సహా పిల్ల నచ్చింది వరుస సినిమాలతో అలరించారు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన సూపర్‌హిట్ సినిమా లాహిరి లాహిరి లాహిరిలో (2002) తెలుగులో ఆమెకు చివరి చిత్రం. బాలీవుడ్‌లో దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌తో సూర్యవంశ్ సినిమాలోనూ నటించారు. అనంతరం బెంగాలీ టీవీ రియాల్టీ షో ‘దీదీ నం.1’ వ్యాఖ్యాతగా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
బెంగాల్‌లో మహిళలకు సాధికారత కల్పించే లక్ష్యంతో ప్రారంభమైన ‘దీదీ నెంబరు 1’ రియాల్టీ షోకు దశాబ్దం కాలం నుంచి యాంకర్‌గా ఉన్నారు. మహిళల్లో ఈ షోకి మంచి ఆదరణ లభించింది. ఎన్నికల ప్రచారంలో బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ రచన ఈ షో' షూటింగ్‌కు ఒక్క రోజు కూడా మిస్ కాలేదు.
నటిగా, యాంకర్‌గా పాపులారిటీని సొంతం చేసుకున్న రచన లోక్‌సభ ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం చేసి.. తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు వారం రోజుల ముందు మార్చి 10న హుగ్లీ అభ్యర్ధిగా రచన బెనర్జీ పేరును ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. దీంతో హుగ్లీలో ప్రచారం ప్రారంభించిన రచన.. జనంలోకి చొచ్చుకుపోయారు. యాంకర్‌గా తన అనుభవంతో ఆకట్టుకునే ప్రసంగాలకు సహకరించింది. దీంతో బీజేపీ సీనియర్ మహిళా నేత, సిట్టింగ్ ఎంపీ లాకెట్ ఛటర్జీపై 76,853 ఓట్ల మెజార్టీ సాధించి, తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెడుతున్నారు.