తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గిన శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) ఉన్నతాధికారులు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అవమానకర రీతిలో తొలగించారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడంతో పాటు లక్షలాది విద్యార్థులకు ఉచిత విద్యనందించిన డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని విశ్వవిద్యాలయంలో ప్రతిష్టించాలని గతంలో విద్యార్థులు, అధ్యాపకులు కోరారు. దీనికి గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన పాలకమండలి సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి, వర్సిటీ క్యాంపస్‌లో వైయస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు వర్సిటీ నయా పైసా ఖర్చు చేయలేదు. ఎనిమిది మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఇచ్చిన నిధులతో విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే.. తాజాగా టీడీపీ అధికారంలోకి రావడంతో ఎస్కేయూలోని వైయస్ఆర్ విగ్రహాన్ని తొలగించాలని టీడీపీ, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.హుస్సేన్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ లక్ష్మయ్యలను గురువారం డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రంలోపు విగ్రహాన్ని తొలగించాలని, లేదంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలంటూ అల్టిమేటం జారీ చేశారు. దీంతో హడలిపోయిన వీసీ, రిజిస్ట్రార్ గురువారం సాయంత్రమే హడావుడిగా పాలకమండలి సమావేశాన్ని నిర్వహించారు.